వివాహ వయసు పెంచితే.. లాభమా? నష్టమా?  - MicTv.in - Telugu News
mictv telugu

వివాహ వయసు పెంచితే.. లాభమా? నష్టమా? 

October 27, 2020

కశ్మీర్, అయోధ్యలతో పాటు పలు అంశాల్లో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ చివరకు పెళ్లిళ్ల వయసును కూడా పెంచే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉన్న ఆడపిల్లల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచే అవకాశం కనిపిస్తోంది. బాల్యవివాహాలను అరికట్టడానికి అమ్మాయిలకు 18 ఏళ్లు దాటాక, అబ్బాయిలకు 21 దాటాక మాత్రమే పెళ్లి చేయాలని ప్రస్తుత చట్టాలు చెబుతున్నాయి.  ఈ పరిమితి ఉన్నా మనదేశంలో బాల్యవివాహాలు పెద్దసంఖ్యలో సాగుతున్నాయి. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇవి మరింత పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

పేదరికం, ఆడపిల్లలపై వివక్ష, మూఢనమ్మకాలు వంటి ఎన్నో కారణాల వల్ల మన దేశంలో అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్నారు. దీంతో వారు ఎన్నో ఆరోగ్య, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కౌమారదశలోనే ప్రసవాలు, పౌష్టికాహారం అందకపోవడం వారి జీవితాలపై సుదీర్ఘ కాలం ప్రభావం చూపుతున్నాయి. చిన్నవయసులో కాన్పు కావడం వల్ల తల్లీబిడ్డా మరణిస్తున్న సంఘటనలు కోకొల్లలుగా నమోదవుతున్నాయి. చదువు లేకపోవడం, మధ్యలోనే ఆగిపోవడం వల్ల ప్రతి దానికి భర్తపై ఆధారపడాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య అంత తీవ్రంగా లేకపోయినా గ్రామీణ భారతంలో ఎక్కువగానే ఉంది. ముఖ్యంగగా వెనుకబడిన ప్రాంతాల్లో బాల్యవివాహాలు వేలల్లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వివాహ వయసును పెంచాలన్న ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. 

వివాహ వయసును 21కి పెంచడం వల్ల మహిళకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ, ఆపై  చదువులు పూర్తి చేయడం వల్ల తమకాళ్లపై తాము నిలబడి ఆర్థిక సాధికారత సాధించుకుంటారు. శారీరకంగా, మానసికంగా పరిణతి ఉంటుంది కనుక పెళ్లి, ఉద్యోగం వంటి విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం, సంతానం, సంపాదన, పొదుపు వంటి అంశాల్లో భర్తలు చెప్పిందే వేదం అన్నట్లు కాకుండా సొంత ఆలోచనలతో ముందుకు సాగుతారు. 

దీని వల్ల దేశ ఆర్థిక, సామాజిక ముఖచిత్రం కూడా మారిపోతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రసూతి మరణాలు కూడా బాగా తగ్గుతాయని వివరించారు. మనదేశంలో 35 శాతం మంది మహిళలకు 21 ఏళ్లలోపే పెళ్లిళ్లు జరుగుతన్నాయని, దీంతో చాలామంది ఇళ్లకే పరిమితమై, ఎన్నో హక్కులు కోల్పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వివాహ వయసు పెంచడం వల్లే విప్లవాత్మక మార్పులు రాకపోయినా ప్రసూతి మరణాలు తగ్గడం, ఆడపిల్లలు పై చదువులకు పూర్తి చేయడం వంటి కొన్ని లక్ష్యాలు నెరవేరతాయని విద్యావేత్తలు అంటున్నారు.