బుల్లి డ్రోన్లకు స్వేచ్ఛ.. రిజిస్ట్రేషన్ అక్కర్లేదు…

నిశ్చితార్థం, పెళ్లిళ్లు, ఆ కార్యం, ఈ కార్యం.. కార్యం ఏదైనాసరే కనువిందుగా రికార్డు చేసుకోవడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే వీటి వాడకంపై చాలా ఆంక్షలున్నాయి. అందుకే కొందరు భయపడుతుంటారు. దీంతో డ్రోన్ల వినియోగాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

డిసెంబర్ 1 నుంచి ఎగిరే డ్రోన్లు, రిమోట్లీ పైలెటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ (ఆర్‌పీఏఎస్)లను భారత ప్రభుత్వం చట్టద్ధం చేసింది. ఇందుకోసం నేటి నుంచి డ్రోన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.  250 గ్రాముల కంటే తక్కువ బరువున్న డ్రోన్లను మినహా మిగతా డ్రోన్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

rrr

డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రవేశపెట్టిన ‘డ్రోన్ రెగ్యులేషన్స్ 1.0’ పాలసీ ప్రకారం డ్రోన్లు నిబంధనలు పాటించాలి. 250 గ్రాములు అంతకంటే తక్కువున్న వాటిని నానో డ్రోన్లుగా పిలిస్తారు. వీటికి మాత్ర రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కానీ ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చి, ప్రజల ప్రైవసీకి భంగం కలగకుండా  చూసుకోవాలి. మిగతా డ్రోన్లకు మాత్రం రిజిస్ట్రేషన్ తప్పని సరి చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటికి యునిక్ ఐడెంటిఫికేషన్ నంబరు(యూఐఎన్) ఇస్తారు.

దీనిపై పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ.. ‘ డ్లోన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాం. డిసెంబర్ 1నుంచి జనవరి 1 వరకు డ్రోన్ల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.

ఇందులో కూడా కొన్ని షరతులు విధించారు. డ్రోన్లను పగటి పూట మాత్రమే ఉపయోగించాలి. అదీ కంటికి కనిపించేంతా ఎత్తులోనే వినియోగించాలి. విమానాశ్రయాలు, అంతర్జాతీయ సరిహద్దులు, సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లు, సైన్యానికి చెందిన ప్రదేశాల్లో డ్రోన్లను ఉపయోగించకూడదు. అలాగే ఎకో-సెన్సిటివ్ జోన్స్, తాత్కలికంగా లేదా శాశ్వతంగా డ్రోన్లను నిషేందిచిన స్థలాల్లో వాటిని వాడకూడదు. అలాగే డ్రోన్లను కదులుతున్న వాహనం నుంచి, విమానాల నుంచి ఆపరేటర్ చేయటం కూడా నిషేధం.