ప్లాస్మా చికిత్సతో ఫలితం లేదు.. ఎయిమ్స్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్లాస్మా చికిత్సతో ఫలితం లేదు.. ఎయిమ్స్

August 7, 2020

Plasma therapy trial didn’t show benefit in reducing Covid-19 mortality risk: AIIMS

కరోనా చికిత్సలో ప్మాస్మా థెరపీ ఇప్పుడు ప్రధానంగా మారిందని వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మాదానం చేయాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ఆసుపత్రుల్లో ప్లాస్మా బ్యాంకులే ఏర్పడ్డాయి. కరోనావైరస్ బారినపడి కోలుకున్న వారి రక్తంలోని ప్మాస్మాతో చేసే చికిత్సను ప్మాస్మా థెరపీగా పేర్కొంటున్నారు. ఇదిలావుండగా ప్లాస్మా చికిత్సతో ఎలాంటి ఫలితం లేదని ఢిల్లీ ఎయిమ్స్ బాంబు పేల్చింది. ప్లాస్మా థెరపీ కరోనా బాధితులపై పెద్దగా ప్రభావం చూపడం లేదని ఎయిమ్స్ తెలిపింది. కరోనా రోగులపై నిర్వహించిన ప్మాస్మా చికిత్స ఫలితాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయం వెల్లడైందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా వెల్లడించారు.

రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. ‘ప్మాస్మా చికిత్స ఫలితాలను అంచనా వేసేందుకు 15 మంది కరోనా రోగులతో కూడిన రెండు బృందాలపై పరిశీలన జరిపాం. ఇందులో ఒక బృందానికి సాధారణ విధానంలో చికిత్స అందించాం. మరో 15 మందికి సాధారణ పద్ధతితో పాటు ప్మాస్మా చికిత్సను కూడా అందించాం. ఈ రెండు విధానాల్లోనూ మరణాల రేటు సమానంగా ఉంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాలంటే పరిశోధనలు జరగాల్సి ఉంది. ప్మాస్మా థెరపీ వల్ల కరోనా రోగులకు ఎలాంటి ప్రమాదమూ లేదు.. అలాగే దీని వల్ల ప్రయోజనం కూడా లేదు’ అని గులేరియా తెలిపారు. ఇదిలావుండగా కరోనా మహమ్మారి మరో పోలీసు అధికారిని బలి తీసుకుంది. బాచుపల్లి ఎస్సై యూసుఫ్ కరోనాతో మృత్యువాత పడ్డారు. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గత పక్షం రోజులుగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయారు. అయితే ఆయనకు ఇటీవలే కానిస్టేబుల్ సాయికుమార్ ప్లాస్మా దానం చేశారు. దీంతో ఇక ఆయన కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు ఆశించారు. అయినా ఆయన మృతిచెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.