Plastic surgeon booked for tying stray dog to car, dragging it along road in Rajasthan
mictv telugu

వీడసలు డాక్టరేనా?.. మూగజీవి పట్ల ఇంత అమానుషమా?

September 19, 2022

మనుషులకి చికిత్స చేసే ఓ డాక్టర్ మానవత్వం మరిచి మాగజీవాన్ని దారుణంగా హించాడు. తన ఇంటి వద్ద ఉన్న వీధి కుక్కను తన కారుకు కట్టేసి ఊరంతా తిప్పాడు. ఆ కుక్క కారు వేగంతో వెనకాల పరుగెత్తలేక తీవ్రంగా ఇబ్బంది పడింది. కారు వెంట పరిగెత్తలేక ఆ మూగజీవి చిత్రహింస అనుభవించింది. ఈ హృదయ విదారక ఘటన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

 

వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ డాక్టర్ తన ఇంటి దగ్గర కుక్క ఉండటం ఇష్టం లేక.. దాని మెడకు తాడు కట్టి కారుకు కట్టుకొని వేగంగా నడుపుకుంటూ వెళ్లాడు. దీంతో ఆ కుక్క కారుతో అంత వేగంగా పరుగెత్తలేక గాయాలపాలైంది. ఇదంతా బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసాడు. అంతే కాకుండా ఆ కారును ఆపి కుక్కను విడిపించి.. పోలీసులు, డాగ్ హోమ్ ఫౌండేషన్ ‌లకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుక్కను హింసించిన డాక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

డాగ్ హోం ఫౌండేషన్ అనే ఎన్‌జీవో ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. కుక్కను కారుతో ఈడ్చుకెళ్లిన ఆ డాక్టర్ పేరును రజనీష్ గల్వాగా తెలిసింది. వీధికుక్కని వదిలించుకోవడానికే ఇలా చేసినట్టు రజనీష్ చెప్పాడు. ఆ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, అతడి లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థను, మేనకాగాంధీని ట్యాగ్ చేసింది సదరు ఎన్‌జీవో. ఆ తర్వాత డాక్టర్‌పై జంతు హింస చట్టం కింద నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని కూడా షేర్ చేసింది.