దయచేసి మా వాదనలు కూడా వినండి.. సుప్రీంకోర్టుకు కేంద్రం వినతి - MicTv.in - Telugu News
mictv telugu

దయచేసి మా వాదనలు కూడా వినండి.. సుప్రీంకోర్టుకు కేంద్రం వినతి

June 21, 2022

‘అగ్నిపథ్’ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వినతిపత్రం అందజేశారు. నిర్ణయం తీసుకునే ముందు మా వాదనలు కూడా వినండి అంటూ కేంద్ర రక్షణ శాఖ సుప్రీంకోర్టును కోరింది. ఇందుకు కారణం.. అగ్నిపథ్ స్కీమ్‌కు సంబంధించి సుప్రీంకోర్టులో ఇటీవలే పిటిషన్లు దాఖలయ్యాయి. అగ్నిపథ్‌కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉన్నట్టయితే తమ వైపు నుంచి కూడా వాదనలను వినాలని కేంద్రం కోరింది.

అగ్నిపథ్ స్కీమ్‌పై వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఇప్పటివరకు మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. మొదటగా ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ అనే ఇద్దరు లాయర్లు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా పిటిషన్లు వేశారు. సోమవారం హర్ష్ అజయ్ సింగ్ అనే అడ్వొకేట్ కూడా పిటిషన్ వేశారు. తన పిటిషన్‌లో అగ్నిపథ్ అమలుపై మరోసారి పునరాలోచన చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన పేర్కొన్నారు. అగ్నిపథ్ వల్ల జాతీయ భద్రత, సైన్యం ఎలాంటి ప్రభావానికి గురవుతుందో అంచనా వేయడానికి సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అడ్వొకేట్ విశాల్ తివారీ తన పిటిషన్‌లో కోరారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసంపై విచారణ జరిపేందుకు సిట్‌ను కూడా ఏర్పాటు చేయాలని విన్నవించారు.

మరోపక్క అగ్నిపథ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌ను నిలిపివేయాలని ఆందోళలను జరుగుతున్నప్పటికి, అవేమి పట్టించుకోకుండా అగ్నివీరుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో అభ్యర్థులపై ఏలాంటి కేసులు ఉన్నా, ఆందోళనలో పాల్గొన్నట్లు తేలిన ఉద్యోగానికి అర్హులు కారని తేల్చి చెప్పింది. మరోవైపు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఈ నెల 24వ తేదీన నిరసన చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడుతూ, అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని వినతిపత్రాలను అందజేశారు.