మోదీ ప్రకటించిన ప్రాజెక్ట్ లయన్, ప్రాజెక్ట్ డాల్ఫిన్‌ అంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ ప్రకటించిన ప్రాజెక్ట్ లయన్, ప్రాజెక్ట్ డాల్ఫిన్‌ అంటే..

August 15, 2020

PM launches Project Lion, Project Dolphin on I-Day

74వ స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని ఇవాళ రెండు కొత్త ప్రాజెక్టుల గురించి ప్రకటించారు. ప్రాజెక్టు లయన్, ప్రాజెక్ట్ డాల్ఫిన్‌ అనే రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల పేర్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులతో అంతరించే రెండు జంతు జాతులను ఆధునిక టెక్నాలజీతో సంరక్షించనున్నట్లు వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టులపై కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ వివరణ ఇచ్చింది. ఆసియాటిక్ సింహాలను ప్రాజెక్ట్ లయన్ ద్వారా సంరక్షించనున్నట్లు ఆ మంత్రిత్వశాఖ ప్రతినిధి స్పష్టంచేశారు. సింహాల వ్యాధులు, అనుబంధ జాతి సింహాల గురించి ఈ ప్రాజెక్టులోని ఆధునిక టెక్నాలజీతో అధ్యయనం చేయనున్నట్లు వివరించారు. వెటర్నరీ కేర్‌కు సంబంధించి కూడా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇక రెండో ప్రాజెక్ట్ డాల్ఫిన్‌తో నదుల్లో, సముద్రాల్లో ఉన్న డాల్ఫిన్ల సంరక్షణకు చర్యలు తీసుకోనున్నట్టు పర్యావరణశాఖ ప్రతినిధి చెప్పారు. 

డాల్ఫిన్ల సంఖ్య పెంచడం, నీటి జీవాల సంరక్షణ, వేటను నియంత్రించే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా జాలర్ల జీవితాల్లో మార్పులు తీసుకురానున్నట్టు తెలిపారు. కాగా, పంద్రాగస్ట్ సందర్భంగా సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ఏర్పాటు చేసిన యాంటీ డ్రోన్ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎర్రకోటపై జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న నేపథ్యంలో భద్రతాధికారులు దీన్ని ఏర్పాటు చేశారు. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ దాదాపు మూడు కిలోమీటర్ల వరకు నిఘా ఉంచగలదు. అతి సూక్ష్మ పరిమాణంలోని డ్రోన్లను కూడా పసిగట్టి నియంత్రించగలదు. లేజర్ ఆయుధం వాట్స్ పవర్‌ని బట్టి 1 నుంచి 2.5 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను ఛేదించగలదు.