మోదీ, అమిత్‌షాలు అందరి కళ్లు తెరిపించారు: ఏక్‌నాథ్ షిండే
తమ పార్టీకి చెందిన వ్యక్తిని కాకుండా, మరో పార్టీకి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి ప్రధాని మోదీ, అమిత్ షాలు అందరి కళ్లు తెరిపించారన్నారు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే. శివసేన ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేసి చివరకు బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని పొందిన ఆయన.. ఇవాళ అసెంబ్లీలో సీఎం హోదాలో తొలిసారి మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై ప్రశంసల జల్లు కురిపించారు. ”దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద 115 మంది శాసన సభ్యులు ఉండగా, తన వద్ద 50 మంది మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ, ఫడ్నవీస్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా నన్ను ముఖ్యమంత్రిని చేశారు. వారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది కళ్ళు తెరిపించింది” అని ఏక్‌నాథ్ షిండే చెప్పారు.
”బాల్ ఠాక్రే ఆదర్శాల ఆధారంగా ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ-శివసేన ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రతిపక్ష పార్టీల నేతలు అధికారంలో ఉన్న పార్టీలో చేరడాన్ని మనం ఇంతవరకు చూశాం. ఇప్పుడు మాత్రం అధికారంలో ఉన్న నేతలు ప్రతిపక్షంలోకి మారాల్సి వచ్చింది” అని ఏక్‌నాథ్ షిండే చెప్పుకొచ్చారు. తనలాంటి సామాన్యుడు మంత్రి పదవిలో ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని వదిలేసి వెళ్ళడం చాలా పెద్ద విషయమని ఆయన అన్నారు. తనతో పాటు మరికొంత మంది మంత్రులు కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని వదిలి వెళ్ళారని గుర్తు చేశారు. కాగా, మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం పని చేస్తుందని డిప్యూటీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారు.