PM Modi attended a meeting of BJP workers at Begumpet Airport
mictv telugu

రోజూ మూడు కేజీలు తింటాను.. అదే నా బలం : ప్రధాని మోదీ

November 12, 2022

PM Modi attended a meeting of BJP workers at Begumpet Airport

దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఒక్క కేరళ తప్ప అన్ని రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. అక్కడ బీజేపీ శ్రేణుల కోసం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో కమల వికాసం స్పష్టంగా కనిపిస్తోందని, ఎక్కడ సమస్యలు ఉంటాయో అక్కడ బీజేపీ ఉంటుందన్నారు.

అవినీతిని పూర్తిగా నిర్మూలించాలని, పేదలను దోచుకునే వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఐటీకి కేరాఫ్ అయిన నగరంలో అధికార పార్టీ మూఢనమ్మకాలను పెంచి పోషిస్తోందని విమర్శించారు. కొందరు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, వాటిని పట్టించుకోనని కొట్టిపారేశారు. ‘ప్రజాజీవితంలో ఎన్నో ఏళ్లుగా తిట్లు తింటున్నాను. వాటి బరువు రోజుకు మూడు కేజీలు ఉంటుంది. అవే నాకు బలంగా మారుతున్నాయి. రైతులు బాగుపడుతారంటే ఎన్ని తిట్లు తినడానికైనా సిద్ధం. తెలంగాణ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమను వడ్డీతో సహా చెల్లిస్తాను. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుంది. ప్రజల ఆశీస్సులు మీకు ఉన్నాయనే విషయం మరిచిపోవద్దు’ అని శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.