బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 3-1తో సిరీస్ సొంతం చేసుకోవాలని కోరుకుంటోంది. అలా అయితేనే మిగతా మ్యాచ్ లతో సంబంధం లేకుండా టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.
కాగా నాలుగోటెస్టు తొలిరోజు ఆట చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో కలిసి హాజరయ్యారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌కు స్వాగతం పలికిన ప్రధాని నరేంద్రమోదీ.. అక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయనతో కలిసి వీక్షించారు. ఆ తర్వాత స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేకమైన రథంపై ప్రధాని మోదీ, అల్బనీస్ కాసేపు తిరిగారు. స్టేడియంలో ఇద్దరు ప్రధానమంత్రులు సందడి చేశారు.