హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ “ఇండియా.. ది మోడీ క్వశ్చన్” ను ప్రదర్శించడం వివాదాస్పదంగా మారింది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో మోడీ పాత్రను ఉటంకిస్తూ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పై ప్రస్తుతం వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో సెంట్రల్ యూనివర్సిటీలో కొంతమంది ప్రధాని మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శించారని క్యాంపస్ అధికారులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఫిర్యాదు చేసింది. దీంతో హెచ్సీయూలో ప్రధాని నరేంద్ర మోడీ డాక్యుమెంటరీ కి సంబంధించిన రచ్చ కొనసాగుతుంది.
ఫ్రాటర్నిటీ గ్రూప్స్ అయిన స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్(SIO), ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్(MSF) విద్యార్థి సంఘాలు అనుమతి లేకుండా స్క్రీన్ షోను ఏర్పాటు చేశాయని ఫిర్యాదు అందింది. నార్త్ షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలో జరిగిన ఈ స్క్రీన్ షోకు 50 మంది విద్యార్థులు హాజరయ్యారని సమాచారం.
2002 గోద్రా అల్లర్లు, రామ మందిర నిర్మాణ ఘర్షణ… ఈ వ్యవహారంలో ప్రధాని మోడీ పాత్రపై బీబీసీ డాక్యుమెంటరీ చేసింది. ఈ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇదే సమయంలో ఈ వీడియోని బ్లాక్ చేయాలని ట్విట్టర్, యూట్యూబ్ లను కూడా ఆదేశించింది. తర్వాత హైదరాబాద్ లోని హెచ్ సి యు క్యాంపస్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించడం విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తతలకు కారణంగా మారింది. గచ్చిబౌలి పోలీసులకు హెచ్సీయూ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. అధికారిక ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
ఇక బీబీసీ డాక్యుమెంటరీపై ఏబీవీపీ మండిపడుతోంది. దేశంలో మళ్లీ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్క్రీన్ ప్రదర్శించిన, వీక్షించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి :
Today Gold Price : భగ్గుమంటున్న బంగారం.. రేపోమాపో 60 వేలకు దగ్గరలో
5G ఫోన్ కేవలం రూ.999లకే, ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్ తో కొనే చాన్స్..!!