కరోనా కొత్త వేరియంట్ వ్యాపిస్తుండడంపై ప్రధాని మోదీ గురువారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, హోం మంత్రి అమిత్ షా, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కరోనా టెస్టుల సంఖ్య పెంపు, జీనోమ్ సీక్వెన్సింగ్, వ్యాక్సిన్ ప్రికాషన్ డోసులను పెంచాలని దిశానిర్దేశం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేశారు. ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పన, ఆక్సిజన్ సిలిండర్ల ఏర్పాటు, పడకలు, మందులు, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అలాగే ధరలపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, కొత్త వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. పొరుగునున్న కర్ణాటక ఇప్పటికే మాస్కులను తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాలు సహా ఏసీ రూములు, ఇండోర్ లొకేషన్లలో మాస్కులను తప్పనిసరి చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి శ్వాసకోశ సమస్యలు వచ్చినా కరోనా టెస్టులు తప్పనిసరి చేస్తూ ఆదేశాల్లో పేర్కొంది. అటు యూపీలో తాజ్ మహల్ సందర్శనకు వచ్చేవారు తప్పనిసరిగా నెగిటివ్ కోవిడ్ సమర్పించడం తప్పనిసరి చేసింది అక్కడి ప్రభుత్వం. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణీకులకు విమానాశ్రయాల్లోనే కోవిడ్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు.