ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రధాని మోడీ నేడు ఏపీలోని భీమవరంలో పర్యటించారు. రూ. 30 కోట్లతో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అల్లూరి సీతారామ రాజు కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రసంగం అనంతరం ఆంధ్రప్రదేశ్‌కి చెందిన స్వాతంత్ర్య సమరయోధులైన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి కుటుంబ సభ్యులను మోదీ కలిశారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. ఆ వీర దంపతుల కుమార్తె పసల కృష్ణభారతికి పాదాభివందనం చేశారు. 90 ఏళ్ల వయసు కలిగిన కృష్ణభారతి వీల్ ఛైర్లో ఉండగా ప్రధాని ఆమె పాదాలను తాకి, నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.
పసల కృష్ణమూర్తి వి.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని పడమర విప్పర్రులో 1900 జనవరి 26న సంపన్న కుటుంబంలో జన్మించారు. ఈయన భార్య అంజలక్ష్మి. ఈమె కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. భర్త అడుగులో అడుగేస్తూ ఆంగ్లేయులపై యుద్ధం సాగించారు. అంతేకాదు.. పేదల కడుపునింపుతూ, ఆరోగ్య సేవలు అందించింది వీరి కుటుంబం.
1929 ఏప్రిల్ 25న చాగల్లు ఆనంద నికేతన్ కు వచ్చిన గాంధీజీని కలిసి ఖద్దరు నిధికి తమ ఒంటిపైనున్న ఆభరణాలన్నింటినీ ఇచ్చేశారు కృష్ణమూర్తి, అంజలక్ష్మి. ఈయన జీవితాంతం గాంధీజీ వేషధారణలోనే సంచరించారు.కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులిద్దరూ వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ, అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారు. తమ ఇంటిలోనే ఆశ్రయం కల్పించి, దళిత, పేద బాల బాలికలకు చదువు చెప్పించారు. తమ ఇంటినే ధర్మాసుపత్రిగా మార్చారు. ఓ వైద్యుడిని నియమించి అంజలక్ష్మి నర్సుగా, కృష్ణమూర్తి కాంపౌండరుగా సేవలందించారు. తమ 60 ఎకరాల పొలాన్ని సమాజహితం కోసం ఖర్చు చేశారు. స్వాతంత్య్రానంతరం సమరయోధులకిచ్చే పింఛను, సౌకర్యాలనూ కూడా వద్దన్నారు. ప్రభుత్వమిచ్చిన భూమినీ పేదల స్కూల్ కు విరాళంగా ఇచ్చేశారు. అలాంటి కుటుంబానికి చెందిన కృష్ణభారతి కాళ్లు మొక్కారు ప్రధాని మోడీ. దేశానికి సేవ చేసిన వారి బిడ్డ ఆశీర్వాదం అందుకున్నారు.