మన్‌కీ బాత్‌లో తెలంగాణ ప్రస్తావన.. సిరిసిల్ల నేతన్నపై ప్రశంసలు - MicTv.in - Telugu News
mictv telugu

మన్‌కీ బాత్‌లో తెలంగాణ ప్రస్తావన.. సిరిసిల్ల నేతన్నపై ప్రశంసలు

November 27, 2022

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో మాట్లాడారు. తెలంగాణకు చెందిన ఓ చేనేత కార్మికుడిపై ప్రశంసలు కురిపించారు. ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘‘మన్ కీ బాత్’’ 95వ ఎపిసోడ్‌లో ప్రసంగించిన ప్రధాని.. సిరిసిల్ల నేతన్న గురించి ప్రస్తావించారు. సిరిసిల్ల చేనేత వస్త్రం, చేనేత కార్మికుల గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా జీ-20 పేరుతో హరిప్రసాద్ అనే చేనేత కార్మికుడు తన చేతితో స్వయంగా నేసిన వస్త్రాన్ని చూపిస్తూ.. చేనేత కార్మికుల గొప్పదనం, కళా నైపుణ్యాన్ని కొనియాడుతూ వారిని అభినందించారు.

హరిప్రసాద్‌ తన స్వహస్తాలతో నేసిన G-20 లోగోను తనకు పంపినట్లు వెల్లడించారు ప్రధాని. అద్భుతమైన బహుమానం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. తన కళతో అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో హరిప్రసాద్ నైపుణ్యం ఉందన్నారు. తన తండ్రి నుండి ఈ అద్భుతమైన నేత ప్రతిభను వారసత్వంగా పొందిన హరిప్రసాద్‌ చేనేత కళకు మెరుగులు దిద్దారని ప్రశంసించారు. తనకు పంపిన లేఖలో హరిప్రసాద్.. చేనేత పరిశ్రమ గురించి అనేక సూచనలు చేసినట్లు తెలిపారు. ఆ సూచనలు పరిశీలించి ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జీ-20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని లేఖలో వెల్లడించారని గుర్తు చేశారు.

ఇదికూడా చదవండి : హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. శంషాబాద్ వరకు మెట్రో సేవలు