5 లక్షలు మోదీ వేశాడని ఖర్చుపెట్టి జైలుపాలు - MicTv.in - Telugu News
mictv telugu

5 లక్షలు మోదీ వేశాడని ఖర్చుపెట్టి జైలుపాలు

September 15, 2021

PM Modi sent me money...': Bihar man refuses to return wrongfully credited funds

విదేశాల్లోని భారతీయులు దాచిపెట్టుకున్న నల్లధనాన్ని తెప్పించి దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని అప్పుడెప్పుడో మోదీ ఎన్నికల సమయంలో చెప్పినా చెప్పకపోయినా కోట్లాదిమంది ఇంకా అమాయకంగా నమ్ముతూనే ఉన్నారు. తన బ్యాంకు ఖాతాలోకి పొరపాటున జమ అయిన రూ. 5.5 లక్షలను ఓ వెర్రినాగన్న మోదీనే వేశారని పొరపడి ఖర్చు చేశాడు. అతని తప్పేం లేకపోయినా బ్యాంకు ఫిర్యాదుతో పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. బిహార్‌లోని ఖగరియాలో ఈ దారుణం జరిగింది.

స్థానికంగా గ్రామీణ బ్యాంకులో రంజిత్ దాస్ అనే వ్యక్తికి ఖాతా ఉంది. ఈ ఏడాది మార్చిలో బ్యాంకు సిబ్బంది పొరపాటువల్ల అతని ఖాతాలో ఐదున్నర లక్షలు వచ్చిపడ్డాయి. మోదీ వేస్తానన్న 15 లక్షల్లో తొలి వాయిదా కింద ఆ డబ్బు పడిందేమో అనుకున్నాడు రంజిత్. ఎంచక్కా ఆ డబ్బును విత్ డ్రా చేసుకుని ఇష్టమొచ్చినట్టు ఖర్చుపెట్టాడు. పొరపాటు గుర్తించిన బ్యాంకు సిబ్బంది అతని ఇంటికి వెళ్లి, ఐదున్నర లక్షలను తిరిగి ఇచ్చెయ్యమన్నారు. అయితే డబ్బులు అయిపోయాయని రంజిత్ ఖాళీ అకౌంటు చూపించాడు. తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి అతనికి బేడీలు వేసి జైలుకు తీసుకెళ్లారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతడు అమాయకుడని, డబ్బును తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చెయ్యాలిగాని జైల్లో వేయడం అన్యాయమని నెటిజన్లు వాపోతున్నారు.