నేను కాదు.. మోదీనే క్షమాపణ చెప్పాలి..రాహుల్ గాంధీ - MicTv.in - Telugu News
mictv telugu

నేను కాదు.. మోదీనే క్షమాపణ చెప్పాలి..రాహుల్ గాంధీ

December 13, 2019

Rahul Gandhi

‘రేప్ ఇన్ ఇండియా’ అని కామెంట్స్ చేసిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ లోక్‌సభలో బీజేపీ మహిళా ఎంపీలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. ఢిల్లీని అత్యాచారాలకు రాజధానిగా పేర్కొంటూ మోదీ గతంలో వ్యాఖ్యానించారని, ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలకు చెలరేగేలా మోదీ వ్యవహరిస్తున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని, మోదీయే క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

అంతకు ముందు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో మాట్లాడుతూ..’మేకిన్‌ ఇండియాను అత్యాచారాలతో పోల్చుతూ “రేప్ ఇన్ ఇండియా” అని గాంధీ కుటుంబం నుంచి వచ్చిన ఓ రాజకీయ నేత వ్యాఖ్యలు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదేనా రాహుల్‌ దేశ ప్రజలకు ఇచ్చే సందేశం?’ అని ఆమె మండిపడ్డారు. ఆయనకు తగిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. ఇతర పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు కూడా రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే విషయంపై గందరగోళం నెలకొంది. ‘రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలి’ అంటూ కొందరు ఎంపీలు డిమాండ్ చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ..’మోదీ మేక్ ఇన్ ఇండియా అని చెప్పారు. కానీ, ఇక్కడ రేప్ ఇన్ ఇండియా జరుగుతోంది. ఎక్కడ చూసినా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు’ అని పేర్కొన్నారు.