బార్డర్‌లో ప్రధాని ఆకస్మిక పర్యటన.. సైనికులతో మోదీ ప్రత్యేక భేటీ  - MicTv.in - Telugu News
mictv telugu

బార్డర్‌లో ప్రధాని ఆకస్మిక పర్యటన.. సైనికులతో మోదీ ప్రత్యేక భేటీ 

July 3, 2020

PM Modi Surprise Visit to Ladakh

ప్రధాని నరేంద్ర మోదీ ఊహించని పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఎలాంటి సమాచారం, ముందస్తు ప్రణాళిక లేకుండానే లడఖ్‌లో పర్యటించారు. శుక్రవారం ఉదయం నేరుగా సరిహద్దు ప్రాంతానికి వెళ్లి అక్కడ సైనికులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల చైనాతో వీరోచితంగా పోరాడి.. నిత్యం గస్తీ కాస్తున్న జవానుల్లో ధైర్యం నింపేందుకు ఈ ఆకస్మిక పర్యటన చేపట్టారు. అత్యంత రహస్యంగానే ఆయన పర్యటనకు ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మోదీ  వెంట త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా ఉన్నారు. దురాక్రమలకు పాల్పడిన వారిని ఏ మాత్రం ఉపేక్షించవద్దని ఈ సందర్భంగా ప్రధాని సూచనలు చేశారు. 

లడఖ్, లేహ్ పర్యటిస్తూ.. సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలను పోస్టు చేసిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. ఆర్మీ దుస్తువులు ధరించి సైనికులతో కొంతసేపు ఆయన ముచ్చటించారు. విధుల్లో ఉన్న జవానులకు సెల్యూట్ చేసి, వారి భుజాలు తడుతూ అభినందించారు. ఆ సమయంలో జై జవాన్, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో సరిహద్దులు దద్దరిల్లాయి. కరోనా ఆంక్షలను కూడా పక్కనపెట్టి అతి సమీపంగా సైనికులను తాకుతూ.. షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు. ఇప్పటికే చైనా, పాక్ చర్యలతో భారత్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ క్రమంలో వాటికి చెక్ పెట్టేందుకు డిజిటల్ స్ట్రైక్ చేస్తూ.. 59 యాప్‌లను నిషేధించారు. ఆ వెంటనే మోదీ ఈ పర్యటనకు పూనుకున్నారు. నిజానికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అక్కడికి వెళ్లాల్సి ఉంది. ఆయన టూర్ కోసమే ఏర్పాట్లు జరిగాయి.  కానీ చివరి నిమిషంలో మోదీ అక్కడికి వెళ్లడం విశేషం.