ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ నేతలు ధ్రువీకరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగబోతున్న క్రమంలో ఈసీ ఎన్నికల కోడ్ అమలు చేసింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మార్చి చివరి వారంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలనో భాగంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ నుంచి ప్రధాని నరేంద్ర మోదీని పోటీ చేయించాలని కాషాయదళం భావిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఒకవేళ ప్రధాని మోదీ తెలంగాణ నుంచి పోటీ చేయాల్సి వస్తే.. మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ తమకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు అంచనాకు వచ్చారట. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి కేంద్రంలో వరుసగా మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధించాలనేది బీజేపీ లక్ష్యం. అదే సమయంలో ఈ సారి దక్షిణాది రాష్ట్రాల పైన బీజేపీ ఫోకస్ చేసింది. ఈ ఏడాది కర్ణాటక, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఎలాగైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారం దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
అందులో భాగంగానే ఓసారి మహబూబ్ నగర్‌పై హోంమంత్రి అమిత్ షా సీక్రెట్‌గా సర్వే చేయించారట. మహబూబ్ నగర్‌లో ప్రధాని మోదీ పోటీ చేస్తే.. ప్రభావం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, రాష్ట్రం మీద ఏ స్థాయిలో ఉంటుందన్న దానిపై మొదటి విడత సర్వేను నిర్వహించినట్లు తెలుస్తోంది. త్వరలో రెండో రెండో విడత సర్వే కూడా చేయనున్నట్లు సమాచారం.