ప్రధాన మంత్రి మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19న ప్రధాని రావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతోనే వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పీఎంఓ సమాచారం అందించింది. అయితే ప్రదాన మంత్రి తెలంగాణ పర్యటన రీ షెడ్యూల్ తేదీని మాత్రం ప్రకటించలేదు. వారంలోనే మోదీ వస్తారన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా తెలంగాణ బీజేపీ నేతలు ముమ్మరంగా చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాలతోపాటు పలు రాజకీయ కార్యక్రమాలు కూడా మోదీ పర్యటనలో భాగంగా ఫ్లాన్ చేశారు. అయితే వేరే ప్రొగ్రామ్స్ వల్ల ప్రధాని తెలంగాణ పర్యటన వాయిదా పడింది.
ప్రధాని తెలంగాణ టూర్లో వందే భారత్ రైలు ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. సుమారు రూ.7000 కోట్ల విలువైన ప్రాజెక్టులు, ప్రారంభోత్సవాల శంకుస్థాను చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్- విజయవాడ మధ్య రైల్వే ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన, కాజీపేట్‌లో కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. సికింద్రాబాద్-మహబూబ్ నగర్ మధ్య 85 కి.మీ మేర డబ్లింగ్ రైల్వే లైన్ ను మోదీ ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రధాని మోదీ టూర్ వాయిదా పడడంతో ఈ పనులన్నీ వాయిదా పడనున్నాయి. ప్రధాని పర్యటన తాత్కాలికంగానే వాయిదా పడిందని, త్వరలోనే మోదీ తెలంగాణకు వచ్చి అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు.