PM Modi unveils National Emblem cast on new Parliament building
mictv telugu

కొత్త జాతీయ చిహ్నం ఆవిష్కరణ.. కొత్త పార్లమెంట్ భవనం విశేషాలివే

July 11, 2022

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022తో 75 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. 75 వసంతాలు పూర్తి చేసుకున్నప్పటి నుంచి నూతన పార్లమెంట్ భవనంలో ఉభయ సభల సమావేశాలను నిర్వహించాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే నేడు దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని(ఆశోక స్థంభం) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మిస్తోంది. దీనికి హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూపకల్పన చేసింది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణం కోసం రూ.971 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈరోజు ప్రధాని ఆవిష్కరించిన జాతీయ చిహ్నం.. మొత్తం 9500 కిలోల కాంస్యంతో 6.5 మీటర్ల ఎత్తుతో కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ ఫోయర్ పైభాగంలో ఏర్పాటు చేశారు. ఈ చిహ్నానికి సపోర్ట్‌గా 6500 కిలోల ఉక్కుతో సహాయక నిర్మాణం చేపట్టారు. కొత్త పార్లమెంట్ భవనం పై కప్పుపై జాతీయ చిహ్నం కాన్సెప్ట్ స్కెట్, కాస్టింగ్‌ను క్లే మోడలింగ్/కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వరా చేశారు. ఎనిమిది దశలలో ఈ చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాగా, జాతీయ చిహ్నం ఆవిష్కరణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ.. కొత్త పార్లమెంట్ నిర్మాణ పనుల్లో భాగస్వామ్యమైన అధికారులు, కార్మికులతో కాసేపు మాట్లాడారు. కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.

ఈ భవనాన్ని నాలుగు అంతస్థులతో నిర్మిస్తున్నారు. లోయర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్, మొదటి, రెండో అంతస్థులు ఉంటాయి. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. లోక్‌సభ ఛాంబర్‌లో 888 సీట్లు ఉంటాయి. దీని మొత్తం వైశాల్యం 3,015 చదరపు మీటర్లు. రాజ్యసభ చాంబర్లో 384 సీట్లు ఉంటాయి. దీని వైశాల్యం 3,220 చదరపు మీటర్లు. భూకంపాలను తట్టుకునే విధంగా ఈ నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు.