తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ వేళ ఆదివారం ఉదయం 11.00 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఈ ట్రైన్స్ ను ప్రారంభించారు. రైలును ప్రారంభించిన తర్వాత ప్రదాని మోడీ ప్రసంగించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకువందేభారత్ పండుగ కానుక అని చెప్పారు. ఈ రైలు ద్వారా రెండు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి అవకాశం దక్కనుందని అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య ఈ రైలుతో ప్రయాణ సమయం కూడా తగ్గనుందని మోడీ తెలిపారు. పూర్తిగా దేశీయంగా తయారైన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లతో అనేక ప్రయోజనాలున్నాయని మోడీ చెప్పారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, తెలంగాణ హోం మంత్రి మహామూద్ అలీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పాల్గొన్నారు. దేశంలో ఇప్పటికే ఏడు వందే భారత్ ట్రైన్ లు ప్రారంభం కాగా.. అత్యధిక దూరం ప్రయాణించే ట్రైన్ గా నేడు ప్రారంభించనున్న సికింద్రాబాద్-విశాఖ ట్రైన్ నిలవనుంది. ఈ ట్రైన్ 698.5 కి.మీ ప్రయాణించనుంది.
వందే భారత్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. ఇందులో 14 ఏసీ చైర్ కార్లు కాగా, రెండు బోగీలు ఎగ్జిక్యూటివ్ ఏసీ కార్ కోచ్‌లు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఏసీ కార్ కోచ్‌లో 104 సీట్లు ఉంటాయి. ఇక ఎకానమీ క్లాస్‌లో 1,024 సీట్లు ఉంటాయి. మొత్తంగా ఈ రైలులో 1,128 మంది ప్రయాణం చేయొచ్చు. రెగ్యులర్ బుకింగ్ కింద 806 సీట్లు, తత్కాల్ బుకింగ్ కింద 322 సీట్లు కేటాయించారు.
ఇక ఈ రైలుకు ఆటోమేటిక్ తలుపులుంటాయి. వాటి నియంత్రణ లోకో పైలట్ దగ్గర ఉంటుంది. మధ్యలో ప్రయాణికులు వాటిని తెరవలేరు, మూయలేరు. రైలు ఆగిన కొన్ని క్షణాలకు డోర్లు తెరుచుకుంటాయి. బయలుదేరడానికి కొన్ని సెకన్ల ముందు మూసుకుంటాయి. కోచ్‌లో 32 అంగుళాల డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో రైలు వేగంతో సహా అన్ని వివరాలు డిస్ప్లే అవుతాయి. లోపల బయట సీసీటీవీ కెమెరాలు ఉటాయి. ట్రైన్ లోపల వైఫై సౌకర్యం కూడా ఉంది. ఎదురుగా రైలొస్తే ఢీ కొట్టకుండా కవచ్ టెక్నాలజీ ఉంది. ప్రతి కోచ్‌లో 4 ఎమర్జెన్సీ లైట్లు ఏర్పాటు చేశారు.