దేశ సైన్యాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ అన్నారు. దిల్లీలో బుధవారం కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లే.. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవలసి ఉంటుందన్నారు. దేశానికి వెన్నుముకగా ఉన్న చిన్న, మధ్య తరహా వ్యాపారాలను మోదీ ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. పదే పదే ఉద్యోగాలపై తప్పుడు ఆశలు కల్పించి.. దేశంలోని యువతను నిరుద్యోగం అనే అగ్నిబాటలో నడిచేలా మోదీ ఒత్తిడి తెచ్చారన్నారు. దేశాన్ని ముగ్గురు పారిశ్రామికవేత్తలకు అప్పగించిన ప్రధాని.. ఈ ‘అగ్నిపథ్’ పథకంతో ఇప్పుడు ఆర్మీలో ఉద్యోగావకాశాలు లేకుండా చేయాలని చూస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ నేతలు వన్ ర్యాంక్ – వన్ పెన్షన్ అని మాట్లాడారని.. ఇప్పుడు ర్యాంక్ లేదు.. పెన్షన్ లేదంటున్నారని రాహుల్ విమర్శించారు. దేశ యువతకు అంతా అర్థమవుతుందన్నారు. కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.