పెరిగిన ప్రధాని మోదీ ఆస్తులు.. మొత్తం ఎంతో తెలుసా?
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టి 8 ఏళ్లు దాటింది. మే 2014లో తొలిసారిగా ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత, మే 2019 లో ఆయన రెండోసారి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అదే సమయంలో దాదాపు 13 ఏళ్ల పాటు గుజరాత్ సీఎంగా కూడా ఉన్నారు. ఆయన అక్టోబర్ 2001 నుంచి మే 2014 వరకు ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించారు. అయితే చాలా కాలంగా ఉన్నత పదవుల్లో ఉన్న ప్రధాని మోదీ ఎన్ని ఆస్తులు కూడబెట్టారో తెలుసా?
ప్రధాని మోదీ ఆస్తులు రూ. 2.23 కోట్లుగా పీఎంవో ప్రకటించింది. గతేడాది మార్చి 2021 చివరి నుంచి ఈ ఏడాది మార్చి 31 , 2022 నాటికి మోడీ ఆస్తులు రూ. 1,97,68,885 నుండి రూ. 2,23,82,504 కోట్లకు పెరిగినట్లు పీఎంవో పేర్కొంది. మొత్తంగా 2021 -22 సంవత్సరంలో నరేంద్ర మోడీ చరాస్తుల విలువ రూ. 26.13 లక్షలు పెరిగినట్లు పీఎంవో వెబ్‌సైట్ వెల్లడించింది.
మొత్తం ఆ 2.23 కోట్లలో ఎక్కువ శాతం బ్యాంక్ డిపాజిట్ల రూపంలో ఉంది. అయితే ఆయన పేరు మీద ఎటువంటి స్థిరాస్తి లేదు. గాంధీనగరలో తనకున్న కొద్ది స్థలాన్ని కూడా విరాళంగా ఇచ్చేశారు. బాండ్, షేర్, మ్యుచువల్ ఫండ్స్‌లో ఆయనకు పెట్టుబడి లేదు. స్వంత వాహనం లేదు. అయితే మోదీకి నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వాటి విలువ 1.73 లక్షలు. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఓ రెసిడెన్షియల్ ప్లాట్‌ను ముగ్గురితో కలిసి కొన్నారు. అయితే ఆ ఫ్లాట్‌ను దానం చేసినట్లు తెలుస్తోంది.