Home > Featured > సిద్ధేశ్వర స్వామీజీ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం

సిద్ధేశ్వర స్వామీజీ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం

PM Narendra Modi condoles Siddheshwara Swami's death, hails his outstanding service to society

కర్ణాటకలోని విజయపుర కేంద్రంలోని జ్ఞానయోగాశ్రమ పీఠాధిపతి సిద్దేశ్వర స్వామి(81) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన.. సోమవారం సాయంత్రం ఆశ్రమంలో తుది శ్వాస విడిచారని విజయపుర డిప్యూటీ కమిషనర్ విజయ్ మహంతేష్ ప్రకటించారు. జ్ఞానయోగాశ్రమ ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో భక్తులు, అనుచరులు తరలివచ్చి నివాళులర్పించారు. సిద్ధేశ్వర స్వామికి కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలలో కూడా భక్తులు, అనుచరులు ఉన్నారు.

కర్ణాటక ప్రభుత్వం సిద్దేశ్వర స్వామికి ప్రభుత్వ లాంఛనంగా అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. సిద్దేశ్వర స్వామికి నివాళులు అర్పించేందుకు విజయపుర జిల్లా యంత్రాంగం మంగళవారం పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రధాని న‌రేంద్ర మోదీ, ఇత‌ర ముఖ్యనేత‌లు సిద్దేశ్వర స్వామి మృతిప‌ట్ల సంతాపం తెలిపారు.

‘సిద్దేశ్వర స్వామి సమాజానికి చేసిన విశిష్ట సేవలు గుర్తుండిపోతాయని.. ఇతరుల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పని చేశారని’ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆశ్రమానికి వచ్చినప్పుడు ప్రధాని మోడీ ఫోన్‌లో స్వామి ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

విజయపురలోని జ్ఞానయోగాశ్రమానికి చెందిన సిద్దేశ్వర స్వామి శివైక్యం చెందారనే వార్త విని చాలా బాధపడ్డానని, తన ఉపన్యాసాల ద్వారా మానవాళి మోక్షానికి కృషి చేసిన పీఠాధిపతి సేవలు అద్భుతమని, అద్వితీయమని బొమ్మై ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన నిష్క్రమణ రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొంటూ.. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానన్నారు. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, జేడీ(ఎస్) నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి, బొమ్మై మంత్రివర్గంలోని పలువురు సహచరులు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Updated : 2 Jan 2023 10:00 PM GMT
Tags:    
Next Story
Share it
Top