మనల్నిమనం కాపాడుకుంటూ ముందుకు సాగాలి - MicTv.in - Telugu News
mictv telugu

మనల్నిమనం కాపాడుకుంటూ ముందుకు సాగాలి

May 12, 2020

PM says 4th phase of COVID-19 lockdown will be 'new and improved', incorporate states' suggestions

కరోనావైరస్‌పై ప్రపంచ పోరాటం నాలుగు నెలలుగా సాగుతోందని.. ఒక వైరస్ ప్రపంచాన్నే  అతలాకుతలం చేస్తోందని ప్రధానమంత్రి నదేంద్ర మోదీ అన్నారు. కరోనా మహమ్మారికి సంబంధించి మోదీ ఐదోసారి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల జీవితాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని వాపోయారు. నాలుగు నెలలుగా కరోనాతో పోరాడుతున్నామని అన్నారు. కరోనా నుంచి మనల్ని మనం  రక్షించుకోవాలి.. అదే సమయంలో ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదని, వినలేదని తెలిపారు. కరోనాకు ముందుకు కరోనా తర్వాత విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 3 లక్షలకు పైగా మంది మరణించారని చెప్పారు. 

మోదీ మాట్లాడుతూ.. ‘కరోనాతో యావత్తు ప్రపంచం ఒక రకమైన యుద్ధం చేస్తోంది.

మానవజాతి ఇదివరకెప్పుడూ ఊహించని ఉత్పాతమిది. అలసిపోవడం, ఓడిపోవడం, వెనుకంజ వేయడం మనుషులు సహించరు. కరోనా సంక్షోభం మొదలైనప్పుడు భారత్‌లో ఒక్క పీపీఈ కిట్ కూడా తయారయ్యేది కాదు. ఎన్95 మాస్కులు నామమాత్రంగానే ఉత్పత్తి అయ్యేవి. కానీ ఇప్పుడు భారత్‌లో ప్రతి రోజూ 2 లక్షల పీపీఈ కిట్లు, 2 లక్షల ఎన్95 మాస్కులు తయారుచేస్తున్నాం. ఆపదను అవకాశంగా భారత్ మార్చుకోవడంతోనే ఇది సాధ్యమైంది. మన సంకల్పం ఈ సంక్షోభం కన్నా గొప్పది. 21వ శతాబ్దం భారత్‌దేనని మనం గత శతాబ్దం నుంచి ఎప్పుడూ వింటూ వచ్చాం. ఇవన్నీ చూస్తుంటే.. 21వ శతాబ్దం భారత్ కల మాత్రమే కాదు, బాధ్యత కూడా’ అని మోదీ తెలిపారు. కాగా, మార్చి 24 నుంచి అమల్లో ఉన్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు పొడిగించిన విషయం తెలిసిందే. రెండోసారి విధించిన లాక్‌డౌన్ మే 3తో ముగియాల్సి ఉండగా, మరో రెండువారాల పాటు పొడిగిస్తూ మే 1న హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు ఇప్పటికే మే 12 నుంచి రైలు ప్రయాణాలకు కేంద్రం అనుమతించింది. మే 15 లోపు దేశీయ విమానాలను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.