ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగిపోతోన్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం నేడు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. జోషిమఠ్ గ్రామం వేగంగా భూమిలోకి కుంగిపోతుండడం, ఇళ్లకు పగుళ్లు వస్తుండడంపై ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా .. ఉత్తరాఖండ్ రాష్ట్ర సీఎస్ ఎస్ఎస్ సంధు, డీజీపీ అశోక్ కుమార్‌లతో వీడియో కాన్పరెన్స్ ద్వారా చర్చించారు. జోషిమఠ్ గ్రామాన్ని పరిశీలించిన నిపుణులు కూడా సమావేశంలో పాల్గొని తాజా పరిస్థితిపై సమీక్షించారు. ఎవరికీ ఎలాంటి హాని జరగకూడదన్నదే ఉద్దేశంతో జోషిమఠ్ గ్రామ ప్రజలను వేగంగా తరలించాలని నిర్ణయించారు. మరోసారి కేంద్రం నిపుణులతో గ్రామాన్ని సందర్శించి.. భూమి కుంగిపోవడానికి గల కారణాలను సత్వరమే తెలుసుకోవాలని సూచించారు.
జోషి మఠ్‌లో అనూహ్య ఘటనలు జనాన్ని భయపెడుతున్నాయి. గత కొద్దిరోజులుగా జోషిమఠ్ ప్రాంతంలోని వందల ఇళ్ళకు పగుళ్ళు ఏర్పడడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉన్నఫళంగా ఇళ్ళకు పగుళ్ళు ఏర్పడుతుండడం కలకలం రేపుతోంది.మరోవైపు రోడ్లపైనా ఇవే పగుళ్ళు హడలెత్తిస్తున్నాయి.దీనికి కారణమని భావిస్తున్నా స్పష్టమైన కారణాలు ఇంతవరకు బయటికి రాలేదు. ఈ విషయాన్ని అధ్యయనం చేసిన ప్రముఖ శాస్త్రవేత్త కాలాచంద్ సైన్ ఊరు కుంగడానికి కారణాలు శాస్త్రీయంగా విశ్లేషించారు ‘‘జోషీమఠ్ కుంగడానికి కారణాలు చాలా ఉన్నాయి. వందేళ్ల కిందట భూకంపం వల్ల విరిగిపడిన కొండచరియలపై ఈ ఊరిని నిర్మించారు. ఇది తరచూ భూకంపాలు వచ్చే v సిస్మిక్ జోన్లో ఉంది. నేలకింద జలప్రవాహాలు, ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొన్ని దశాబ్దాలుగా సాగుతున్నాయి. ఫలితంగా లోపలి శిలల పటుత్వం దెబ్బతింది. రుషిగంగ, ధౌలిగంగ వరదలు, కుంభవృష్టి వల్ల కూడా ఊరిని దెబ్బతీశాయి. మౌలిక వసతుల కోసం పలు భారీ ప్రాజెక్టులు చేపట్టడం కూడా ఒక కారణం. హోటళ్లు, రెస్టారెంట్లు తామరతంపరగా పెరిగాయి. ఈ పరిస్థితిలో జోషిమఠ్ ఆవాస యోగ్యం కాదు. అక్కడి ప్రజలను శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలించడమే మార్గం..’’ అని వివరించారు కాలాంచంద్.