వరవరరావుకు కరోనా.. విడుదల కోసం ఆందోళన - MicTv.in - Telugu News
mictv telugu

వరవరరావుకు కరోనా.. విడుదల కోసం ఆందోళన

July 16, 2020

Poet varavarao tested covid positive

విప్లవ రచయితల సంఘం నేత, ప్రముఖ కవి, వక్త వరవరరావుకు కరోనా సోకింది. తీవ్ర అస్వస్థతతో ముంబైలోని తలోజా జైల్లో చికిత్స పొందుతున్న ఆయనకు పరీక్ష చేయగా కోవిడ్ పాజిటివ్ ఫలితం వచ్చింది. ముంబైలో కరోనా కేసులు తీవ్రంగా ఉండడంతో ఆయనకు కూడా సోకే ముప్పు ఉందని కుటుంబ సభ్యులు ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఇప్పుడైనా ఆయన వయసును దృష్టిలో ఉంచుకని విడుదల చేయాలని తెలంగాణ ప్రజాసంఘాలు, రచయితల, కళకారుల సంఘాలు కోరుతున్నాయి. 80 ఏళ్ల వరవరరావు 20 నెలలుగా జైల్లో ఉంటున్నారు. 

భీమా కొరేగావ్ కేసులో ఆయనను 2018 నవంబరులో మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి అరెస్ట్ చేశారు. ప్రధాని మోదీ హత్యకు కుట్రపన్నారని ఆరోపించారు. పునా, గడ్చిరోలి జైల్లలో ఉన్న ఆయన ఈ ఏడాది మొదట్లో ముంబై జైలుకు తరలించారు. ఆయన ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నారని, మెరుగైన చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు కోడంతో జేజే ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన వరవరరావు ప్రస్తుత పాత సంగతులు గుర్తుచేసుకుంటున్నారని, ఆయనను వెంటనే విడుదల చేయాలని భార్య, కుమార్తెలు కోరుతున్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఆయన విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నా సీఎం కేసీఆర్ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.