ఇంకో ఐదేళ్లయినా పోలవరం పూర్తి కాదు.. మంత్రి హారీశ్ రావు
పోలవరం ప్రాజెక్ట్‌పై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఐదేళ్లయినా ఆ ప్రాజెక్ట్ పూర్తి కాదని, అక్కడ పనిచేసే ఇంజనీర్లకు కూడా దీనిపై ఓ స్పష్టత లేదన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. కాళేశ్వరం గురించి ప్రతిపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక అబద్దాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ఫలాలు అందుకుంటున్న ప్రజలు ఆ అబద్దాలను తిప్పికొట్టాలని సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు ఏపీలో ప్రారంభమైన పోలవరం ఇంతవరకు పూర్తి కాలేదని తెలిపారు. అక్కడ ఇంజనీర్లను అడిగితే ఏమో సార్ తెలియదు ఇంకా ఐదేళ్లు పట్టొచ్చు అన్నారని హరీశ్ రావు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం పూర్తయి మన పంటలకు నీరు వస్తోందని, అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. దిల్లీలో, హైదరాబాద్ పార్టీ కార్యాలయాల్లో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుందని… గ్రామాల్లోకి వెళ్లి చూస్తే కాళేశ్వరం ఫలితాలు తెలుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ రాక ముందు ఎలా ఉంది ఇప్పుడూ ఎలా ఉంది అనేది మనకు మనమే సాక్ష్యమని ఆయన అన్నారు. బీజేపీపా నాయకులు తెలంగాణ రైతులను నూకలు తినమని అవమాన పరిచారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గింజ కొనుగోలు చేశారని తెలిపారు.