పోలీసులా.. పిశాచాలా..! - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసులా.. పిశాచాలా..!

November 18, 2017

అవినీతితో కోట్లు సంపాదించుకుని చట్టాలకు దొరక్కుండా తప్పించుకునే రాజకీయనాయకులకు, పారిశ్రామికవేత్తలకు  రాచమర్యాదలు చేసే పోలీసులు సామాన్యుల విషయంలో పరమ కిరాతకంగా వ్యహరించడం మామూలే.

లాకప్ టార్చర్, లాకప్ డెత్.. వంటివి కొత్తేమీ కాదు కదా. ఇవి మామూలే, కాస్త వెరైటీగా హింసిద్దామనుకున్నారు యూపీ పోలీసులు. ఓ చోరీ కేసులో నిందితుడైన  మైనర్ బాలుణ్ని ఆరుబయట కూర్చోబెట్టి చిత్రహింసలు పెట్టారు. అతని మోకాళ్లపై కర్రపెట్టి దానిపై ఎక్కి తొక్కారు.. లాఠీతో కాళ్లు, చేతులు, వీపులపై పాశవికంగా దాడి చేశారు.

అతను ఆర్తనాదం చేస్తూ, తనను క్షమించాలని,  కొట్టొద్దని ప్రాధేయపడుతున్నా వినకుండా పశువును బాదినట్లు బాదారు. ఈ ఘోరం మహరాజ్‌గంజ్ జిల్లాలోని పనియారా పోలీస్ స్టేషన్లో జరిగింది. ఈ దారుణాన్ని ఎవరో ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు సదురు రెండు పోలీసు పిశాచాలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో ఒకరిని ఇప్పటికే సస్పెండ్ చేశారు. నిబంధనల ప్రకారం.. మైనర్లను హింసించకూడదు.