వీసా గడువు ముగిసిపోయినప్పటికీ ఓ చైనా దేశస్థుడు మన దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నాడు. దానికి నాగాలాండ్‌కు చెందిన ఓ మహిళ తన వంతు సహాయం చేసింది. బీహార్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. అతని పేరు జీ ఫేయి అని, చైనాలోని హెబే ప్రావిన్స్‌లోని జింజీ ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు.
ఫేయి వీసా గడువు జూన్ 30 2020 నాటికే ముగిసిపోయిందని, కానీ, దానిని 2022 వరకు ఉన్నట్టు ఫోర్జరీ చేశాడని తేలింది. దాంతో అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, వివిధ ఏజెన్సీలకు ఈ సమాచారాన్ని చేరవేశామని డిప్యూటీ కమిషనర్ విశాల్ పాండే తెలిపారు. ఇదిలా ఉండగా, నేపాల్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తూ ఇద్దరు చైనా పౌరులు భద్రతా బలగాలకు పట్టుబడడంతో వారి ద్వారానే ఢిల్లీలోని చైనీయుడి వివరాలు తెలిశాయని పోలీసులు తెలిపారు. నాగాలాండ్‌కు చెందిన మహిళ పెటేఖ్రీనువో వీరిద్దరికి సిమ్ కార్డులు, నకిలీ ఓటరు కార్డులు సమకూర్చినట్టు విచారణలో తేలిందని పాండే వెల్లడించారు. కాగా, చైనీయులు దేశంలోకి అక్రమంగా ఎందుకు వచ్చి వెళ్తున్నారో అర్ధం కావట్లేదని, ఇప్పటికే ఇంటెలిజెన్స్, రా ఏజెన్సీలను అప్రమత్తం చేశామని ఆయన వివరించారు.