Police arrested a young woman for not wearing hijab in Iran
mictv telugu

ఇరాన్‌లో కలకలం.. హిజాబ్ వేసుకోలేదని యువతి అరెస్ట్.. మృతి

September 17, 2022

Police arrested a young woman for not wearing hijab in Iran

షియా మెజారిటీ దేశమైన ఇరాన్‌లో హిజాబ్ అంశం తీవ్ర కలకలం రేపుతోంది. మతాచారాల ప్రకారం హిజాబ్ వేసుకోలేదని ఓ యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తర్వాత ఆమె మరణానికి కారణమయ్యారు. దీంతో అంతర్గతంగా తీవ్ర నిరసన వ్యక్తం కాగా, ఆమ్నెస్టీ సహా ప్రపంచ దేశాలు తమ ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఘటనపై విచారణ జరపాలని దేశ అధ్యక్షుడు హోం మంత్రిని ఆదేశించారు. వివరాలు.. మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి రాజధాని నగరమైన టెహ్రాన్లో తన కుటుంబసభ్యులతో ఉన్నప్పుడు.. ఆ దేశంలో డ్రెస్ కోడ్, మతాచారాలను పర్యవేక్షించే మొరాలిటీ పోలీసులు యువతి హిజాబ్ ధరించలేదని గుర్తించారు. ఆ కారణంతో పోలీసులు ఆమెను మంగళవారం అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అయితే తర్వాత యువతి కోమాలోకి వెళ్లిపోయి శుక్రవారం మరణించింది.

ఈ విషయం మీడియాలో రావడంతో దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం యువతి మృతదేహాన్ని మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానకి తరలించగా, అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ న్యాయం కావాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఏకపక్షంగా అరెస్ట్ చేసి మరణానికి కారణమయ్యారని ఆరోపించారు. దీంతో పోలీసులు ఎంటరయి ఆందోళనకారులను చెదరగొట్టారు. అటు అమెరికా రాయబారి రాబర్ట్ మాల్లీ స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆమ్నెస్టీ కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో స్పందించిన దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఘటనపై విచారణ జరపాలని హోం మంత్రిని ఆదేశించారు. కాగా, ఇటీవల కాలంలో ఇరాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువయ్యాయని పలు దేశాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. ఇటు మన దేశంలో కూడా విద్యాసంస్థల్లో హిజాబ్ అంశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.