Police arrested Balaswamy in Bijinepally
mictv telugu

18 లక్షలు కాజేసి మూడు నెలలుగా అత్యాచారం.. సర్పంచ్ తండ్రి నిర్వాకం

August 22, 2022

మాయమాటలతో మహిళను మోసగించి ఆమె వద్ద ఉన్న డబ్బు కాజేయడమే కాక, మూడు నెలలుగా గదిలో నిర్బంధించి అత్యాచారం చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. బిజినేపల్లి మండలానికి చెందిన ఓ మహిళ కారుకొండ గ్రామ సర్పంచ్ తండ్రి మిద్దె బాలస్వామి ఇంట్లో పనిచేస్తుండేది. అయితే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో మహిళకు చెందిన కొంత భూమి ముంపునకు గురవడంతో మహిళకు పరిహారంగా ప్రభుత్వం రూ. 22 లక్షలు మంజూరు చేసింది. ఈ డబ్బులలో రూ. 18 లక్షలను మిద్దె బాలస్వామి మాయమాటలు చెప్పి రెండేళ్లు విడతల వారీగా తన అకౌంటుకు బదిలీ చేసుకున్నాడు. ఆ డబ్బును తిరిగివ్వాలని మహిళ కోరడంతో అప్పుడు, ఇప్పుడంటూ తిప్పుకున్నాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, అందరి ముందు ఆ డబ్బు తిరిగిచ్చేస్తానని ఒప్పుకున్నాడు. తర్వాత కథ షరామామూలుగా ఉండడంతో మే నెలలో బాధితురాలు బాలస్వామిని గట్టిగా నిలదీసింది. దీంతో బెదిరింపులకు పాల్పడిన బాలస్వామి.. మహిళతో పాటు ఆమె భర్తను కూడా చంపుతానని హెచ్చరించాడు. అంతేకాక, ఆమెను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించి మూడు నెలలుగా అత్యాచారం చేశాడు. ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్‌ఐ ఓబుల్ రెడ్డి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఐపీసీ 324, 420, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.