Police arrested shirisha for married three mens
mictv telugu

నంద్యాలలో పాతికేళ్ల పెళ్లికూతురు.. ముగ్గురు రెడ్లతో వివాహం

May 27, 2022

Police arrested shirisha for married three mens

ఏపీ కర్నూలు జిల్లా నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు భాగోతం బయటపడింది. తన తల్లి మద్దతుతో పెళ్లి పేరుతో యువకులను మోసం చేస్తున్న పాతికేళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల మండలంలోని మిట్నాల గ్రామంలో శిరీష అనే యువతి తల్లి మేరీ జసింటాతో కలిసి నివసిస్తోంది. శిరీషకు మొదట అవుకు మండలం చెన్నంపల్లెకు చెందిన పాణ్యం మల్లికార్జున రెడ్డితో వివాహం అయింది. అయితే కొన్ని రోజులకే కాపురంలో కలహాలు వచ్చి శిరీష భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత విడాకులు ఇవ్వకుండానే మరో వివాహానికి సిద్ధమైంది. ఈ సారి ఆత్మకూరు మండలం కొత్తపల్లెకు చెందిన శ్రీనివాస రెడ్డిని పెళ్లి చేసుకుంది. అయితే ఏమైందో తెలియదు కానీ, ఆ పెళ్లి కూడా పెటాకులైంది.

ఇక్కడితో ఆగని శిరీష తన ఇద్దరు మాజీ భర్తలకు విడాకులు ఇవ్వకుండానే మరో వరుడిని వెతుక్కుంది. ఈ సారి బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్ పురం గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డిని మనువాడింది. అయితే మహేశ్వర్ రెడ్డికి ఇది రెండో పెళ్లి కావడంతో శిరీష గతం గురించి పెద్దగా తెలుసుకోకుండానే ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తనకు రెండో పెళ్లి కాబట్టి శిరీష.. తనకు ఆర్ధిక రక్షణ కావాలని అడిగింది. దీంతో మహేశ్వర్ రెడ్డి రూ. 5 లక్షలను శిరీష పేరు మీద డిపాజిట్ చేశాడు. అనంతరం కొద్ది రోజులకే శిరీష తల్లి తన కూతురు ఇంటికి వచ్చి.. నీతో కాపురం చేయాలంటే ఇంకా కొన్ని డబ్బులు, ఆస్థిలో భాగం రాసివ్వాలని అల్లుడు మహేశ్వర్ రెడ్డిని డిమాండ్ చేసింది. అలా అయితేనే నా కూతురితో కాపురానికి ఒప్పుకుంటానని కండీషన్ పెట్టడంతో మహేశ్వర్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చి వీరి గతం గురించి ఆరా తీశాడు. విచారణలో శిరీషకు గతంలోనే రెండు పెళ్లిళ్లు అయ్యాయన్న సంగతి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పాతికేళ్లకే మూడు పెళ్లిళ్లు చేసుకున్న శిరీష, ఆమె తల్లి వ్యవహారం స్థానికులకు చర్చనీయాంశమైంది.