Police Arrested The Thieves Who Stole The Silver Items in Kondagattu Temple
mictv telugu

కొండగట్టు అంజన్న గుడిలో చోరీ.. బీదర్ దొంగల పనే

March 2, 2023

Police Arrested The Thieves Who Stole The Silver Items in Kondagattu Temple

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దోపిడికి పాల్పడిన దొంగల ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చోరీకి పాల్పడ్డ ఆ ముఠా కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన చెందిన బాలాజీ కేశవ రాథోడ్‌, రామారావు జాదవ్‌, రాంశెట్టి జాదవ్‌, విక్రం జాదవ్‌, నర్సింగ్‌ జాదవ్‌, శక్తిజాదవ్‌, విజయ్‌కుమార్‌ రాథోడ్‌ అని, వారంతా దగ్గరి సంబంధీకులని పోలీసులు చెప్పారు.

ఆ ముఠాని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలుగా వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాలలో బుధవారం కేసు వివరాలను ఎస్పీ భాస్కర్‌ మీడియాకు వెల్లడించారు. బీదర్ కు చెందిన వీరు ముఠాగా ఏర్పడి ఆలయాల్లో వెండి నగలు, వస్తువులను ఎత్తుకెళ్ల్లి నగదుగా మార్చుకుని జీవిస్తున్నారని చెప్పారు. కొండగట్టు ఆలయంపై కన్నేసిన ఈ ముఠా గత ఫిబ్రవరి 22న బైక్‌లపై బీదర్‌ నుంచి కొండగట్టుకు చేరుకున్నట్లు తెలిపారు.

అదే రోజు సాయంత్రం గుట్టమీదికి చేరుకున్న దొంగలు ఏ1)బాలాజీ కేశవ రాథోడ్‌, ఏ2) రామారావు జాదవ్‌, ఏ3)రాంశెట్టి జాదవ్‌, ఏ4) విక్రం రాథోడ్‌ అంజన్న భక్తుల మాదిరి కాషాయం, తెల్లప్యాంట్లు ధరించి స్వామిని దర్శించుకుని రాత్రి అక్కడే నిద్రపోయారు. 23న సైతం స్వామివారిని దర్శించుకున్న దొంగలు ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా ఆకలింపు చేసుకున్నారు. అదే రోజు అర్దరాత్రి ఒంటి గంట సమయంలో ఆలయం వెనుక ద్వారాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.

ఆలయంలోని మకరతోరణం, కిరీటం, రెండు శఠగోపాలు, ఆంజనేయ స్వామి ప్రతిమ, వెండి కిరీటం, వెండి గొడుగు, వెండి పెద్ద రామరక్ష, రెండు ద్వారాలకు చెందిన కవచాలను ఎత్తుకెళ్లారు. బాలాజీజాదవ్‌, నర్సింగ్‌ జాదవ్‌, విజయ్‌కుమార్‌ రాథోడ్‌ను అరెస్టు చేసి వారి నుంచి రూ. 3.50 లక్షల విలువైన ఐదు కిలోల వెండి వస్తువులు శఠగోపం, పెద్ద రామరక్ష, రెండు ద్వారాలకు సంబంధించిన కవచాలు, ఒక మోటర్‌ సైకిల్‌, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.