ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అమలాపురం పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఇటీవల కోనసీమలో జరిగిన అల్లర్లలో గాయపడిన బాధితులను పరామర్శించడానికి బయల్దేరిన ఆయనను పోలీసులు జొన్నాడ వద్ద ఆపేశారు. ఆయన వాహనం వెళ్లకుండా ఓ భారీ వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన వీర్రాజు పోలీసులపై తిరగబడ్డారు. అడ్డుకున్న పోలీసును తోసేసి, తనను అడ్డుకోవడానికి మీరెవరంటూ ప్రశ్నించారు. తాను జిల్లా ఎస్పీతో మాట్లాడినా కావాలనే తన కారును ఆపుతున్నారని విరుచుకుపడ్డారు.
అనంతరం అడ్డుగా నిలిచిన భారీ వాహన డ్రైవరుపై మండిపడ్డారు. ‘నువ్వు ఎవర్రా నన్ను ఆపడానికి? ముందు బండి తీయ్, ఇడియట్’ అంటూ ఫైరయ్యారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో కాస్త మెత్తబడిన వీర్రాజు ‘రావుల పాలెంలో మా పార్టీ నాయకుడి తల్లి చనిపోయింది. వెళ్లి పరామర్శించి వస్తా’నని చెప్పడంతో పోలీసులు రావుల పాలెం వరకు అనుమతినిచ్చారు. ఆ తర్వాత వీర్రాజు ట్విట్టర్ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తెలుసుకోలేని స్థాయికి పోలీసు వ్యవస్థను దిగజార్చారని విమర్శించారు.