తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం మౌనదీక్ష చేపట్టగా.. పోలీసులు భగ్నం చేశారు. ఉమెన్స్ డేను పురస్కరించుకుని రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులపై వైఎస్ షర్మిల పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ట్యాంక్‌బండ్‌పై ఉన్న రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అణిచివేతపై ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళలకు అసలు భద్రత లేదని ఆరోపించారు. మద్యానికి ఇచ్చిన విలువ కూడా మహిళల భద్రతకు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శలు కురిపించారు. ఏటా 25 వేల మంది అత్యాచారానికి గురవుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అంతకు ముందు.. ఆమె కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం అత్యాచారాల్లో నెంబర్ వన్ అని, రాష్ట్రంలో అధికార పార్టీ నేతలే అత్యాచారాలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారామె. మహిళలకు భద్రత కల్పిస్తున్నామని కేసీఆర్ సర్కార్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్నారు. కేసీఆర్ దృష్టిలో మహిళలు ఓట్లు వేసే యంత్రాలని, యేటా 20 వేల అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఇంక భద్రత ఎక్కుడుందని ప్రశ్నించారు.
‘తెలంగాణలో ఓకే ఒక్క మహిళకు రక్షణ ఉందని.. ఆమె కల్వకుంట్ల కవిత అన్నారు షర్మిల. మిగతా మహిళలంటే కేసీఆర్‌కు లెక్కే లేదన్నారు. ఏకంగా రాష్ట్ర ప్రథమ పౌరురాలైన గవర్నర్ మీదనే అసభ్య పదజాలం వాడుతున్నారు. గవర్నర్‌కే గౌరవం ఇవ్వడం లేదు. ఇక మామూలు మహిళల పరిస్థితి ఏంటి? సాధారణ మహిళలకు, మహిళా నేతలకే కాదు.. ఐఏఎస్ మహిళా అధికారులకు గౌరవం లేదు. మహిళా ఉపాధ్యాయులకు గౌరవం లేదు’ అని షర్మిల కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.