పగలు పోలీసు.. రాత్రి గొలుసు దొంగ - MicTv.in - Telugu News
mictv telugu

పగలు పోలీసు.. రాత్రి గొలుసు దొంగ

March 31, 2022

bgbg

ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి దొంగతనాలకు పాల్పడి, స్థానికులకు పట్టుబడిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా కైకలూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సింగిడి సత్యనారాయణ అనే పోలీసు పగలు ఉద్యోగం చేస్తూ, రాత్రిపూట గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు. కైకలూరు సంత మార్కెట్ సమీపంలో ఉన్న గూడూరి వెంకట వరప్రసాద్‌ పచారీ దుకాణానికి వెళ్లారు. అతను కౌంటర్‌లో ఉండగా భార్య లోపల సరుకుల వద్ద ఉంది. సత్యనారాయణ జీడిపప్పు కావాలని ఆమెను అడిగాడు. ఆమె వెనక్కి తిరగగానే మెడలో 4 కాసుల బంగారు గొలుసు తెంచుకుని బయటకు వచ్చాడు. అప్పటికే బైక్‌పై సిద్ధంగా ఉన్న సుభాష్‌తో కలిసి ఏలూరురోడ్‌ వైపు పరారయ్యాడు. ప్రజలు వెంబడించగా సత్యనారాయణ తప్పించుకోగా, సుభాష్‌ దొరకిపోయాడు.

అయితే, స్థానికులు అతని వద్దనున్న రూ. 1,20,000 విలువైన గొలుసును, ఓ ద్విచక్ర వాహనాన్ని, ఒక చాకును, పెప్పర్ స్ప్రేను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న కైకలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఆ పోలీసు అధికారి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం సమీపంలోని అప్పనపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అక్కడి నుంచి ఉద్యోగ రీత్యా కైకలూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడని తెలిపారు. అంతేకాకుండా దొంగతనంలో అతనికి సహకరించిన బుద్ధాల సుభాష్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశామని.. కైకలూరు టౌన్ ఎస్సై షణ్ముఖ సాయి తెలిపారు.