వాగు దాటుతున్న మావోయిస్టులు.. వీడియో తీసిన పోలీసులు  - MicTv.in - Telugu News
mictv telugu

వాగు దాటుతున్న మావోయిస్టులు.. వీడియో తీసిన పోలీసులు 

September 14, 2020

Police Capture Maoist Movements

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మావోయిస్టుల కదలికలు అలజడి రేపుతున్నాయి. భారీ ఎత్తున అటవీ మార్గం గుండా మరో ప్రాంతానికి తరలిపోతున్న దృశ్యాలను పోలీసులు సేకరించారు. డ్రోన్ కెమెరా ద్వారా దీనికి సంబంధించిన వివరాలను సేకరించారు. సుకుమా జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే అనుమానంతో అడవిలో కెమెరాతో నిఘా ఏర్పాటు చేయగా వారు ఓ వాగు దాటుతుండగా కెమెరాకు చిక్కారు. కిస్తాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలోడి అటవీ ప్రాంతం నుంచి వీరు వెళ్తున్నారని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సుమారు 200 మందికి పైగా మావోలు దట్టమైన అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. వీరంతా ఆయుదాలతో మకాం మార్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో కొన్నిరోజులుగా పోలీసులు కూంబింగ్ పెంచడంతో తెలంగాణ వైపు వస్తున్నారని అనుమానిస్తున్నారు. దీంతో బార్డర్ ఏరియాలో అధికారులు అప్రమత్తం అయ్యారు.భద్రాచలం, పినపాక, ములుగు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నా ఈ స్థాయిలో కేడర్ ఉండటంతో పోలీసులు కూడా విస్తుపోతున్నారు. తెలంగాణలోనూ మావోయిస్టుల కార్యకలాపాలు పెరుగుతున్నాయని కొన్ని రోజులుగా పోలీసులు ఏజెన్సీ ఏరియాలను జల్లెడపడుతున్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాలో మకాం వేసి పరిస్థితులను సమీక్షించిన సంగతి తెలిసిందే.