వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలు.. కేసు నమోదు - MicTv.in - Telugu News
mictv telugu

వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలు.. కేసు నమోదు

March 15, 2019

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి (68) ఈరోజు ఉదయం గుండెపోటుతో పులివెందులలో కన్నుమూశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించారు. వైఎస్సార్‌కు ఆయన చిన్న తమ్ముడు. వివేకానంద రెడ్డి తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. వివేకానందరెడ్డి గతంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. 1989, 1994లలో పులివెందుల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004 లలో కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు.

Police case filed on ys Vivekananda Reddy death

వివేకానంద రెడ్డి మృతిపై పలు అనుమానాలు..

వివేకానంద రెడ్డి మృతిపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన తలకు, చేతికి గాయాలు అయ్యాయని, ఆయన రక్తపు మడుగులో.. బాత్‌రూమ్‌లో పడి ఉన్నారని కృష్ణారెడ్డి తెలిపారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు (నంబర్ 84/19) నమోదు చేశామని కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పులివెందుల ఆస్పత్రికి పంపించామని, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.