టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో ఓ జూనియర్ స్టూడెంట్ ని బూతులు తిడుతూ దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. భగీరథ్ తో పాటు అతని స్నేహితుడు కూడా విద్యార్ధిపై దాడి చేయడం అందులో కనిపిస్తోంది. మంత్రికి చెప్పినా ఏం చేయలేరంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించడం సంచలనమైంది. దీంతో భగీరథ్ పై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 341, 323, 504, 506, 34 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. అయితే భగీరథ్ ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఢిల్లీలో చదువుకుంటున్న సమయంలో కూడా ఇలాగే ప్రవర్తించాడని సమాచారం.
ఇతని ఆగడాలను భరించలేక సదరు కాలేజీ యాజమాన్యం బయటికి పంపిందని టాక్ వినిపిస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు భగీరథ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి అండ చూసుకుని రెచ్చిపోతున్నాడని మండిపడుతున్నారు. కాగా, ఈ విషయంలో ఓ ట్విస్ట్ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. తనను ప్రేమించాలంటూ భగీరథ్ స్నేహితుడి చెల్లికి దాడికి గురైన జూనియర్ విద్యార్థి తెల్లవారు ఝాము 4 గంటలకు ఫోన్ చేసి వేధించాడని, ఇది తెలిసి ఈ స్థాయిలో ప్రతిస్పందించాడని బాధిత వ్యక్తి చెప్తున్నట్టున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. మరి ఏది నిజమో పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.