Police caught fake IPL in Gujarat
mictv telugu

గుజరాత్‌లో నకిలీ ఐపీఎల్.. రష్యన్ల బెట్టింగ్

July 11, 2022

భారతదేశంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచులు ఎంత ఫేమస్సో తెలిసిందే. దీని ద్వారా బీసీసీఐ భారీ స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. ఇప్పుడు ఆ ఈవెంటుకు నకిలీ పుట్టుకొచ్చింది. ఐపీఎల్ మాదిరే జెర్సీలు, జట్టు పేర్లు ఉంటాయి. దీనిపై రష్యాకు చెందిన ఫుంటర్లు (బెట్టింగ్ రాయుళ్లు) బెట్టింగ్ కాస్తున్నారు. గెలుపోటములను నిర్దేశిస్తున్నారు. ఈ నకిలీ ఐపీఎల్ ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా, విషయం తెలిసి ఆశ్చర్యపోయిన పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. వారి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రష్యాలోని పబ్‌లో ఎనిమిది నెలలు పనిచేసిన షోయబ్ దవ్దా దీనికి కీలక సూత్రధారి. ఒక్కో మ్యాచులో ఆడేందుకు వ్యవసాయ కూలీకి రూ. 400 ఇస్తున్నారు. బొమ్మ వాకీటాకీలతో అంపైర్లు ఉంటారు. ఆటను రికార్డు చేయడానికి ఐదు హెచ్‌డీ కెమెరాలు ఉన్నాయి. మ్యాచును ప్రసారం చేయడానికి యూట్యూబులో అధికారిక ఛానెల్ కూడా ఉంది. అంతేకాక, మీరట్‌కు చెందిన ఓ వ్యక్తి కామెంటేటర్ హర్షాభోగ్లే వాయిస్‌ను ఇమిటేట్ చేస్తాడు. గుజరాత్‌లోని మోహ్సాన జిల్లా మోలిపూర్ గ్రామంలో కొంత భూమి లీజుకు తీసుకొని నిర్వాహకుడు ఈ మ్యాచులను నిర్వహిస్తున్నాడు. రష్యాలోని త్వెర్, వోరోనెజ్, మాస్కోల నుంచి రష్యన్లు పందెం కాస్తున్నారు. కాగా, మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.