ఆంధ్రాబ్యాంకులో 17 కేజీల బంగారాన్ని దోచింది ఇంటిదొంగే... - MicTv.in - Telugu News
mictv telugu

ఆంధ్రాబ్యాంకులో 17 కేజీల బంగారాన్ని దోచింది ఇంటిదొంగే…

October 30, 2019

Police chased chittoor andhra bank robbery case

చిత్తూరు జిల్లా యాదమరిలోని మోర్జనపల్లిలోని అమరరాజా బ్యాటరీల ఫ్యాక్టరీ వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంకులో కొన్ని రోజుల క్రితం భారీ చోరీ జరిగిన సంగతి తెల్సిందే. బ్యాంకులో రూ.3.5 కోట్ల విలువైన 17 కేజీల బంగారం, రూ.2.66 లక్షల నగదు చోరీకి గురైంది. ఆడిటింగ్‌లో లెక్కలు తేడా రావడంతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాళాలు సరిగ్గానే వేస్తున్నామని, అయినా అంత బంగారం ఎలా చోరీ అయిందో అర్థం కావడం లేదని చెప్పారు. దీంతో ఇది ఇంటి దొంగల పనే అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తొలుత బ్యాంకు మేనేజర్‌ పురుషోత్తం ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కానీ, లాభం లేకుండా పోయింది. 

తాజాగా ఈ కేసును పోలీసులు చేదించారు. దొంగతనానికి పాల్పడింది అదే బ్యాంకులో అప్‌రైజర్‌ పనిచేసే రమేష్‌ ఆచారే అని తేలింది. రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి బంగారం, నగదు, సీసీ కెమెరాలు, డీవీఆర్‌లను స్వాధీనం చేసుకున్నారు. రమేష్ దొంగలించిన బంగారాన్ని ముద్దలుగా కరిగించిన అమ్మే ప్రయత్నం చేయగా పోలీసులు పట్టుకున్నారు. పోలీస్ విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. రమేష్ బ్యాంకు సిబ్బందితో నమ్మకంగా ఉంటూ తాళాలను సంపాదించి ఆ తాళాలకు నకిలీ తాళాలను తయారు చేయించాడు. వాటితో లాకర్లను ఓపెన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తాను చేసిన దొంగతనం ఎక్కడ బయటపడుతోందోనని భయపడ్డ రమేష్‌ సీసీ కెమెరా, యూపీఎస్‌ కట్‌ చేసి నగలు దోచుకుని వెళ్లాడు. బ్యాంక్‌లో దోచుకున్న నగలను తాకట్టు పెట్టిగా వచ్చిన డబ్బును షేర్‌ మార్కెట్‌లో పెట్టాడు. అందులో నష్టం రావడంతో బ్యాంక్‌లో దొంగతనానికి పాల్పడ్డట్టు పోలీసు విచారణలో తేలింది. బ్యాంక్‌ అధికారుల నిర్లక్ష్యంతో పాటు సెక్యూరిటీ లోపాలు కారణంగానే రమేష్‌ దొంగతనం చేయగలిగాడని పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చిత్తూరు ఎస్పీ సెంథిల్‌ తెలిపారు.