మనం మస్తు సిన్మలల్ల జూస.. మందిని కాపాడనీకి హీరో జెట్ స్పీడ్ లో ఉర్కచ్చి బాంబును తీస్కొని రన్నింగ్ రేసుల ఉర్కినట్టు ఉర్కి అందరి ప్రాణాలు కాపాడుతడు. అది జూసి మనమందరరం టాకీసుల చప్పట్ల మీద చప్పట్లు కొడ్తం కదా…కనీ గసొంటి సీన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంల నిజంగనే జర్గింది.
మధ్యప్రదేశ్‌లోని సాగర్ ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్ లో బాంబు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే స్కూల్ కు వచ్చిన పోలీసులు బాంబు కోసం మస్తు వెతికిన్రు. స్కూల్లో పెట్టిన బాంబు కానిస్టేబుల్ అభిషేక్ పటేల్ కంటపడింది. పాఠశాలలో ఉన్న చిన్నారులను కాపాడేందుకు.. పటేల్ పది కిలోల బరువు ఉన్న బాంబును భుజాన పెట్టుకొని ఎవరూలేని ప్రదేశంలో పారేయడానికి పరిగెత్తిండు. ఆ సమయంలో పాఠశాలలో 400 మంది చిన్నారులు ఉన్నారు. కిలోమీటరు దూరం పాటు ఆ బాంబును అలాగే పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్లిపోయిండు. .అదృష్టం మంచిగుండి ఆ బాంబు పటేల్ చేతిలో ఉన్నప్పుడు పేలలేదు. పాఠశాలలో బాంబు పెట్టిందెవరని పోలీసులు విచారణ చేపట్టారట. అసాధారణమైన ధైర్యసాహసాలను ప్రదర్శించి 400 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన పటేల్‌ను సహోద్యోగులు, ఉన్నతాధికారులు అభినందిస్తున్నరు. ఆయన చూపించిన ధైర్యాన్ని ప్రశంసిస్తూ ఐజీ రివార్డు కూడా ఇచ్చిన్రు. అభిషేక్ బాంబును తీసుకుని పరుగెత్తుతున్న దృశ్యాలను ఎవరో వీడియోదీసి నెట్టుల వెట్టిన్రు. ఆ వీడియోను చూసి అందరు ఆ పోలీస్ కానిస్టేబుల్ కు సెల్యూట్ కొడ్తున్నరు. సిన్మలల్ల హీరోలు ఉత్తుత్తగ సాహసాలు జేస్తనే సీటీలు, చప్పట్లు కొడ్తం. మరి ప్రాణాల్ను పనంగా పెట్టిన గీ రియల్ హీరో కోసం ఎన్ని సప్పట్లు కొట్టినా తక్కోనే కదా.