ఎస్ఐ అని చెప్పి పెళ్లి చేసుకుంది.. తీరా చూస్తే - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్ఐ అని చెప్పి పెళ్లి చేసుకుంది.. తీరా చూస్తే

April 26, 2022

తెలంగాణలో ఓ కిలేడీ బండారం బయటపడింది. ఎస్ఐ అని చెప్పి ఓ యువకుడిని పెళ్లి చేసుకోవడమే కాకుండా పోలీస్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని పదుల సంఖ్యలో యువకులని మోసం చేసి డబ్బు గుంజింది. చివరికి బండారం బయటపడడంతో కటకటాల వెనక్కి వెళ్లింది. వివరాలు.. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన విజయ భారతి డిగ్రీ పూర్తి చేసి 2018లో పోలీస్ సెలెక్షన్లకు వెళ్లి ఫెయిలైంది. గతంలో ఓ యువకుడితో చేసిన ప్రేమాయణం వల్ల 13 లక్షలు అప్పు చేసింది. తర్వాత ప్రియుడు మొఖం చాటేయడంతో అప్పులు తీర్చేందుకు మోసాల బాట పట్టింది. ఎస్ఐ అయ్యానంటూ నకిలీ పత్రాలు సృష్టించి పలువురితో సన్మానాలు చేయించుకొంది. ఆ ఫోటోలను చూపిస్తూ 50 మంది నుంచి దాదాపు రూ. 70 లక్షలు వసూలు చేసింది. అంతేకాక, ఎస్ఐని అంటూ ఓ యువకుడిని నమ్మించి పెళ్లి కూడా చేసుకుంది. వారికిప్పుడు నాలుగు నెలల బాబు ఉన్నాడు. ఈ క్రమంలో డబ్బులిచ్చిన యువకులు ఒత్తిడి చేస్తుండడంతో ఫోన్ లొకేషన్ తెలియకుండా టెక్నాలజీ ద్వారా తప్పుదోవ పట్టించింది. ఈ నేపథ్యంలో పలువురు యువకులు చేసిన ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చివరకు ఆమె భర్త ద్వారా జాడ తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు.