అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువకులను రెచ్చగొట్టి రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో మొత్తం కుట్రకు బాధ్యుడు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావే అని తేలింది. ఈ కేసులో ఏ1 నిందితుడు ఆవుల సుబ్బారావు ఎట్టకేలకు నోరు విప్పాడు. విచారణలో తానే బాధ్యుడినని ఒప్పుకున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. పథకం ప్రకారం జూన్ 16న సుబ్బారావు సికింద్రాబాద్ చేరుకొని ఓ హోటల్లో అనుచరులతో భేటీ నిర్వహించాడు. భేటీలోనే విధ్వంసానికి ప్రణాళిక రచించి, ఆందోళన చేయాలని అనుచరులకు వాట్సాప్ ద్వారా సందేశాలు పంపాడు. ఆందోళన కారులకు భోజన ఏర్పాట్లను తన అనుచరుడు నరేష్‌ను పురమాయించాడు. విద్యార్ధులను శివ, రెడ్డప్ప, హరి, మల్లారెడ్డి అనే అనుచరులతో రెచ్చగొట్టేలా చేశాడు. ఈ మేరకు వెల్లడించిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును పోలీసులు రిమాండుకు తరలించారు. అటు, డిఫెన్స్ అకాడమీకి రైల్వే యాక్ట్ 1989 కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24న ఆర్పీఎఫ్ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించారు. వెంట అకాడమీకి చెందిన రికార్డులు, ఆధారాల పత్రాలతో రావాలని నోటీసులో సూచించారు.