పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుపోయినా ఖలీస్థానీ వేర్పాటువాద సానుభూతిపరుడు అమృత్‍పాల్ సింగ్ కోసం వేట కొనసాగుతోంది. పోలీసులు పంజాబ్ మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. విదేశాలకు అమృత్ పాల్ సింగ్ చెక్కేసే ప్లాన్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అమృత్‍పాల్ పంజాబ్‍లో ఉన్నారా.. రాష్ట్రం దాటి వెళ్లిపోయారా అన్న దానిపై పోలీసులకు క్లారిటీ రావడం లేదు.
శనివారం అమృత్ పాల్ సింగ్ పక్కా ప్రణాళికతో జలంధర్ జిల్లా షాకోట్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. 100 కార్లతో ఛేజ్ చేసి అతడిని చుట్టుముట్టారు. అయితే పోలీసుల కళ్లుగప్పి అక్కడి ఎస్కేప్ అయిపోయాడు. అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటికే అతడి అనుచరులనున 80 మందికిపైగా అరెస్ట్ చేశారు. శనివారం నుంచి అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సోమవారం అర్థరాత్రి 12 గంటలకు వరకు బ్యాన్ కొనసాగుతుంది. ప్రజలెవరూ తప్పుడు సమాచారాలను ప్రచాచం చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నటుడు దీప్ సిద్దూ మృతి అనంతరం ‘వారిసే పంజాబ్ దే’ ఉద్యమ సంస్ధకు అమృత్ పాల్ సింగ్ నాయకుడిగా ప్రకటించుకున్నాడు.అనంతరం తన ప్రసంగాలు ద్వారా యువతను ఆకర్షించుకొని ఆందోళన బాట పట్టించాడు. గత కొంత కాలంగా సిక్కులకు ప్రత్యేక దేశం కోరుతూ ఖలిస్థాన్ నినాదాలతో యువతను అమృత్ పాల్ సింగ్ రెచ్చగొడుతున్నాడు. అతడి సూచనల మేరకు ప్రత్యేక దేశం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. గత నెలలో అమృత్ పాల్ సింగ్, ఆయన అనుచరులు గత నెలలో అజ్నాలా పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. అల్లర్ల కేసులో అరెస్టయిన తమ అనుచరుడిని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. అతడిని అరెస్ట్ చేయాలంటూ చాలా రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే అతడు పోలీసులకు చిక్కి ..తప్పించుకుపోయాడు.