అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏల యత్నం.. పోలీసుల లాఠీచార్జ్ - MicTv.in - Telugu News
mictv telugu

అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏల యత్నం.. పోలీసుల లాఠీచార్జ్

September 13, 2022

తెలంగాణ అసెంబ్లీ వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన వీఆర్ఏలను పోలీసులు అడ్డగించారు. ప్లే స్కేల్ అమలు చేయాలంటూ ఇందిరాపార్క్ నుంచి బయల్దేరి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వరకు రాగా, పోలీసులు, వీఆర్ఏల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేశారు. తమ సమస్యలపై గత 50 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న వీఆర్ఏలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నగరానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. వీరే కాక, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి సంఘం, తమ సమస్యలు పరిష్కరించాలని సింగరేణి, మత్స్యకార కార్మికులు నిరసనలు తెలిపారు. మరోవైపు వెంటనే బదిలీలు, పదోన్నతుల అమలుకు జీవో జారీ చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. మొత్తం ఏడు సంఘాలు అసెంబ్లీ ముట్టడికి యత్నించాయని సమాచారం. దీంతో ఎక్కడికక్కడ ఆందోళన కారులను అరెస్ట్ చేసిన పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. అంతేకాక, అసెంబ్లీ నుంచి ప్రగతిభవన్‌కు వెళ్లే రోడ్డును మూసివేశారు. అక్కడున్న వ్యాపార సముదాయాలను సైతం మూయించేశారు.