అక్రమ మద్యం కేసులో పోలీస్.. అవమానంతో తండ్రి ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

అక్రమ మద్యం కేసులో పోలీస్.. అవమానంతో తండ్రి ఆత్మహత్య

August 10, 2020

Police in illegal liquor case ..Father commits incident

తన కొడుకు ఎప్పుడూ తనకన్నా ఎక్కువ పేరు సంపాదించాలని ప్రతి తండ్రీ కోరుకుంటాడు. గొప్పవాడు కాకపోయినా కనీసం తండ్రిగా తన పేరును చెడగొట్టకపోతే చాలనే తండ్రులూ ఉన్నారు. అయితే ఓ కొడుకు చేసిన పనికి ఆ తండ్రి తీవ్ర అవమాన భారంతో తన ప్రాణాలు తీసుకున్నాడు. ఉత్త కొడుకే అయితే బాగుండు.. కానీ, అతను నీతిని, న్యాయాన్ని రక్షించే పోలీస్ అవడంతో ఆ తండ్రి బాగా మనస్తాపం చెందాడు. కొడుకుని ఏమీ అనలేక తానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలోని చీరాలలో చోటు చేసుకుంది. అక్రమ మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కిన కానిస్టేబుల్ కిరణ్ తండ్రి ఆత్మహత్యకు పాల్పడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ తన బైక్‌పై తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా.. మద్దిపాడు వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో అతని వద్ద ఉన్న మద్యం బాటిళ్లు అతని గుట్టును రట్టు చేశాయి. పోలీసులు కిరణ్ నుంచి తెలంగాణకు చెందిన 48 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కానిస్టేబుల్ కిరణ్ చేసిన పనిని అతని తండ్రి ప్రసాద్ అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. కొడుకు చేసిన పనితో తనకు మచ్చ రావచ్చని భావించిన ఆయన చీరాల వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.