మంత్రి హరీశ్ రావు కారు తనిఖీ చేసిన పోలీసులు  - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రి హరీశ్ రావు కారు తనిఖీ చేసిన పోలీసులు 

October 20, 2020

Police inspect Minister Harish Rao's car

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచార హోరు పెంచాయి. ఈ నేపథ్యంలో వచ్చీ పోయే ప్రతీ వాహనాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం రాంపూర్ చౌరస్తా వద్ద మంత్రి హరీశ్‌రావు వాహనంతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వాహనాన్ని సైతం పోలీసులు ఆపి, క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. మరోపక్క గత అర్ధరాత్రి దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వాహనం తనిఖీ సందర్భంలో పోలీసుల దురుద్దేశపూరిత అత్యుత్సాహాన్ని, పక్షపాత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని కరీంనగర్ ఎంపీ బండి సంజ‌య్ అన్నారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి ఇది నిదర్శనం అని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని,త‌మ పార్టీ విషయంలో మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నార‌ని అన్నారు.

కాగా, దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ గుర్తుతో పోటీ చేస్తున్నవారిలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ పార్టీ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నుంచి రఘు నందన్ రావు, శ్రమజీవిపార్టీ నుంచి జాజుల భాస్కర్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి సుకురి అశోక్, అల్ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్ నుంచి కత్తి కార్తీక, జై స్వరాజ్ నుంచి గౌట్ మల్లేశం, ఇండియా ప్రజా బంద్ పార్టీ నుంచి సునీల్ ఉన్నారు. ఇక స్వతంత్రంగా పోటీ చేస్తున్న వారిలో అండర్ఫ్ సుదర్శన్, బుట్టన్నగారి మాధవ రెడ్డి, కొట్టాల యాదగిరి ముదిరాజ్, సిల్వెరి శ్రీకాంత్, రేపల్లె శ్రీనివాస్, అన్న బుర్ర రవి తేజ గౌడ్, కోట శ్యామ్ కుమార్‌, అన్న రాజ్, విక్రమ్ రెడ్డి వేముల, కంటే సాయన్న, పీఎం .బాబు, బండారు నాగరాజ్, మోతె నరేష్, వడ్ల మాధవాచారి, రణవేని లక్ష్మణ్‌ రావు తదితరులు ఉన్నారు.