సైబర్ క్రైమ్ పోలీసులకు సినీనటి పవిత్ర ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనపై, నటుడు నరేష్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్ర చేసిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధింత యూట్యూబ్ ఛానెల్స్‌కు, వెబ్ సైట్లకు నోటీసులు జారీ చేశారు. మూడ్రోజుల్లోపు విచారణకు రావాలని 15 యూట్యూబ్ చానళ్లు, వెబ్సైట్ల నిర్వాహకులను పోలీసులు ఆదేశించారు.
గత కొన్ని రోజులుగా నటుడు నరేశ్, పవిత్రల సాన్నిహిత్యంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. కర్ణాటకలోని మైసూర్లో హోటల్లో ఉన్న నరేష్, పవిత్ర లోకేష్ సందర్భంలో అతడ మాజీ భార్య రమ్య పోలీసులను తీసుకుని వెళ్లి రచ్చ చేసింది. అప్పటినుంచి వీరద్దరిపై పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. వీరు కూడా కెమెరా ముందు రాసుకుపూసుకు తిరగడంతో ఆ కథనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇదే కాకుండా వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల సందర్భంగా కూడా వీరిద్దరూ జంటగా కనిపించడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దీంతో తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తమ ఫొటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా ఇబ్బందికరమైన కామెంట్లు పెడుతున్నారని ఫిర్యాదు చేసింది.