Police jobs for 1370 people in Telangana with Supreme Court verdict
mictv telugu

పోలీస్ అభ్యర్ధులకు సుప్రీం అండ.. 1370 మందికి కొత్తగా ఉద్యోగాలు

December 1, 2022

Police jobs for 1370 people in Telangana with Supreme Court verdict

2018లో పోలీస్ ఉద్యోగాలకు పరీక్ష రాసి ఎంపిక కాని అభ్యర్ధులకు సుప్రీంకోర్టు తీపి కబురందించింది. తెలంగాణ పోలీస్ నియామక బోర్డు వేసిన పిటిషన్ ని కొట్టివేసింది. దీంతో 1370 మంది అభ్యర్ధులు పోలీస్ ఉద్యోగాల్లో చేరడానికి మార్గం సుగమమైంది. వివరాల్లోకెళితే.. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు 2018లో నోటిఫికేషన్ జారీ చేయగా, లక్షల సంఖ్యలో అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంపిక ప్రక్రియలు అన్నీ పూర్తయిన అనంతరం 2019 సెప్టెంబర్ 24న ఫైనల్ మెరిట్ జాబితా జారీ అయింది. అయితే అందులో 1370 మంది అభ్యర్ధులు అర్హత కన్నా ఎక్కువ చదువులు చదివిన కారణంగా ఆయా పోస్టుల్లో చేరకపోవడంతో ప్రభుత్వం ఆ పోస్టులను ఖాళీగా ఉంచింది. ఆ ఉద్యోగాలను మెరిట్ లిస్టులో తర్వాత స్థానాల్లో ఉన్న అభ్యర్ధులతో భర్తీ చేయాలని కోరగా.. నిరాకరించడంతో విషయం తొలుత హైకోర్టుకు వెళ్లింది. విచారించిన కోర్టు.. అభ్యర్ధులకు అనుకూలంగా తీర్పునివ్వడంతో రిక్రూట్ మెంట్ బోర్డు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని కొట్టేసిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగానికి ఎంపికైన తర్వాత అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకొని రాలేకపోతే తర్వాత మెరిట్ లిస్టులో ఉన్నవారితో భర్తీ చేయాలని హైకోర్టు తీర్పును పునరుద్ఘాటించింది. యువత ఉపాధి పొందేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక వనరని చెప్తూ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవలసిన అవసరం కనపడడం లేదని పిటిషన్ ని కొట్టేసింది. దీంతో మెరిట్ లిస్టులో తర్వాత స్థానాల్లో ఉన్న 1370 మందికి ఉద్యోగాలు లభించినట్టైంది.
Police jobs for 1370 people in Telangana with Supreme Court verdict
Police jobs, 1370 aspirants, Telangana, Supreme Court verdict, recruitment board